బైక్‌లు ఢీ.. ఒకరి మృతి
నలుగురికి గాయాలు
ఆకివీడు: ఎదురెదురుగా రెండు మోటార్‌సైకిళ్లు అతివేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయరహదారిపై దుంపగడప గ్రామ అడ్డరోడ్డు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కై కలూరు మండలం పెదరామవరంనకు చెందిన బొక్కవరపు రాఘవేంద్రరావు, సామియేలు పనిమీద ఆకివీడు వచ్చి తిరిగి తమ గ్రామానికి బైక్‌పై తిరిగి వెళ్తుండగా ఆకివీడు వెలంపేటకు చెందిన అల్లు మణికంఠ, ఎస్కే అభి, మరో వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వస్తూ దుంపగడప అడ్డరోడ్డు సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బొక్కవరపు రాఘవేంద్రరావు (20) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా అతడితోపాటు వచ్చిన సామియేలుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్‌పై ఉన్న ముగ్గురికి కూడా గాయలవడంతో చికిత్స నిమిత్తం 108లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాఘవేంద్ర చిన్నాన్న బొగ్గవరపు సాయిబాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
భీమడోలు: దైవదర్శనానికి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుకనుంచి కారు ఢీకొట్టింది. శనివారం ఉదయం జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరవాసరం మండలం మత్య్సపురి గ్రామానికి చెందిన పిప్పళ్ల రామకృష్ణ, పుణ్యవతి బైక్‌పై ద్వారకాతిరుమలలోని స్వామి వారి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యమైన కురెళ్లగూడెం వద్దకు వచ్చేసరికి తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారును డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో రామకృష్ణ మోటార్‌సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా తెలిపారు.
నలుగురికి తీవ్ర గాయాలు
ద్వారకాతిరుమల: రాళ్లకుంటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రికి చెందిన దుర్గారావు, నాగరాజు, నాగ అశ్విన్ కె.గోకవరంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. వారు బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బైక్‌పై వెళుతున్న గోపీ అనే వ్యక్తి, వీరి బైక్‌ను ఎదురుగా ఢీకొట్టాడు. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 ఆంబులెన్స్‌లో నల్లజర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బైక్‌లు ఢీ.. ఒకరి మృతి


