కోపల్లె వంతెన వద్ద ఉద్రిక్తత
● జక్కరంలోని ఆర్‌సీఎం చర్చి విద్యుత్ మీటర్ తొలగింపు
● భగ్గుమన్న క్రైస్తవ సంఘాల నాయకులు
కాళ్ల: జక్కరంలోని ఆర్‌సీఎం చర్చి విద్యుత్ మీటర్ తొలగింపుపై క్రైస్తవ సంఘాలు భగ్గుమన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ శనివారం కోపల్లె వంతెన వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జక్కరం–కోపల్లె వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. నాలుగు లైన్ల వంతెన, రోడ్డు పనుల కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు కొలతలు నిర్వహించారు. రోడ్డు మార్జిన్‌లో ఉన్న ఇళ్లు, చర్చిలను తొలగించాలని నిర్ధారించారు. జక్కరంలోని అరుంధతి పేటలో ఆర్‌సీఎం చర్చి విద్యుత్ మీటర్‌ను పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు శుక్రవారం తొలగించారు. ఈ విషయం తెలిసిన స్థానిక ఆర్‌సీఎం చర్చి విశ్వాసులు, పాస్టర్‌లు క్రైస్తవ సంఘాలతో కలిసి శనివారం కోపల్లె వంతెన వద్ద ఆందోళన చేశారు. కోపల్లె వంతెన వద్ద మూడు వైపులా క్రైస్తవ సంఘాల నాయకులు, మహిళలు నిరసన చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐలు జగదీశ్వరరావు, కాళీచరణ్, ఎస్సైలు, తహసీల్దార్ సుందర్ సింగ్, ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీహరిరాజు, ఇతర అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. ఆర్‌సీఎం చర్చి విద్యుత్ మీటర్‌ను ఏర్పాటు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. శనివారం రాత్రి కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. వంతెన ఏర్పాటుకు 100 మీటర్ల దూరంలో ఉన్న చర్చి విద్యుత్ మీటర్ తొలగించటం చాలా అన్యాయమని, క్రైస్తవుల మనోభా వాలకు ఇబ్బంది కలిగించే విధంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఏపీ సీపీఏ ఫౌండర్ చైర్మన్ ఎండీ ఇస్మాయిల్ మండిపడ్డారు. ఆందోళనలో ఏఐసీఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తే రాజ్ కుమార్, ఏపీ సీపీఏ పొలిటికల్ ప్రెసిడెంట్ జి రాజేష్ ఖన్నా, పాలకొల్లు ప్రెసిడెంట్ జోసెఫ్ రాజకుమార్, స్టేట్ కోఆర్డినేటర్ బెనర్జీ, ఎఫ్‌ఎఫ్‌సీఐ నాయకులు స్టాల్ని థామస్, ఆర్‌సీఎం ఫాదర్లు స్టాల్‌ని బాలయేసు తదితరులు పాల్గొన్నారు.


