కమనీయం.. శివయ్య కల్యాణం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను సుగంధభరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటిబోదెలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. సుముహూర్త సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కన్నులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తీర్ధప్రసాదాలను స్వీకరించారు.


