శ్రీవారి క్షేత్రం.. స్వచ్ఛతలో ప్రథమం
ప్రత్యేక శ్రద్ధ వల్లే..
సంతృప్తి, అసంతృప్తి ఇలా..
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి స్వచ్ఛతలో మొదటి ర్యాంక్ దక్కింది. రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా భక్తుల నుంచి నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ద్వారకాతిరుమల దేవస్థానానికి సంతృప్తికర ఫలితాలు లభించాయి. గత నెల ప్రసాదాలకు మొదటి ర్యాంక్ రాగా, ఈసారి స్వచ్ఛతకు ఆ ర్యాంక్ దక్కింది. శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, అన్నవరం, విజయవాడ, సింహాచలం, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత డిసెంబర్ 25 నుంచి ఈనెల 25 వరకూ వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఈ సర్వేను నిర్వహించి, ర్యాంకులను ప్రకటించింది. ద్వారకాతిరుమల 75.8 శాతంతో మొదటి ర్యాంక్ సాధించిది. శ్రీకాళహస్తి 75.8 శాతంతో రెండో ర్యాంక్, అన్నవరం 74.1 శాతం, కాణిపాకం 73.1, సింహాచలం 72.5, విజయవాడ 72.5 శాతం, శ్రీశైలం 69.8 శాతం సాధించాయి.
ఏ అంశానికి ఏ ర్యాంక్
మొత్తం 4 అంశాలపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో సంతృప్తికర దర్శనం అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ అన్నవరానికి, మూడో ర్యాంక్ ద్వారకాతిరుమలకు లభించాయి. తాగునీటి సదుపాయం అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, మూడో ర్యాంక్ అన్నవరానికి లభించాయి. ప్రసాదం తాజా, రుచి అంశానికి మొదటి ర్యాంక్ శ్రీకాళహస్తికి, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమలకు, మూడో ర్యాంక్ అన్నవరానికి వచ్చాయి. పారిశుధ్య నిర్వహణ అంశానికి మొదటి ర్యాంక్ ద్వారకాతిరుమలకు, రెండో ర్యాంక్ కాణిపాకంకు, మూడో ర్యాంక్ సింహాచలంకు లభించాయి. ఓవరాల్‌గా అధిక శాతం మంది భక్తులు ద్వారకాతిరుమల దేవస్థానం అందిస్తున్న సేవలకే మొదటి ఓటు వేయడంతో, ప్రథమ ర్యాంక్ దక్కింది.
శ్రీవారి ధనుర్మాస మండప ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులు
శ్రీవారి కొండపైన జల ప్రసాదం వాటర్ ప్లాంట్
పారిశుద్ధ్య విషయంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం వల్లే ఈ ర్యాంక్ లభించింది. క్షేత్రంలో 2022 అక్టోబర్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు పారిశుద్ధ్య పనులను నిర్వహించిన సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (మంగళగిరి) కంపెనీకి దేవస్థానం నెలకు సుమారు రూ. 18.28 లక్షలు చెల్లించింది. కూటమి ప్రభుత్వం పారిశుధ్య ఇతర పనుల కాంట్రాక్ట్‌ను 2025 అక్టోబర్ 1 నుంచి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు నెలకు రూ. 54 లక్షలకు అప్పగించింది. అరకోటికి పైగా ఖర్చు అవుతున్నా.. మొదట్లో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా జరిగేవి. కాంట్రాక్టర్‌కు ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తున్నందున పారిశుద్ధ్య పనులపై దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శ్రద్ధగా పనులు చేయిస్తున్నారు.
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దర్శనం సంతృప్తికరంగా జరిగిందని 67.7 శాతం మంది, జరగలేదని 32.3 శాతం మంది తెలిపారు. తాగునీటి సదుపాయం, ఇతర మౌలిక వసతులు బాగున్నాయని 73.5 శాతం, బాగోలేదని 26.5 శాతం మంది తెలిపారు. ప్రసాదం తాజాగా, రుచిగా బాగుందని 83.4 శాతం మంది, బాగోలేదని 16.6 శాతం మంది తెలిపారు. పారిశుధ్యం బాగుందని 71.2 శాతం మంది, బాగోలేదని 28.8 శాతం మంది తెలిపారు.
దేవస్థానం సేవలకు శ్రీవారి భక్తుల సంతృప్తి
ప్రభుత్వం నిర్వహించిన వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి
నాలుగు అంశాలపై సర్వే.. మొదటి ర్యాంక్ ద్వారకాతిరుమలకు
శ్రీవారి క్షేత్రం.. స్వచ్ఛతలో ప్రథమం


