రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు భద్రత కరువైందని.. అకృత్యాలు, ఆచారకాలతో సామాన్యులకు, ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని.. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కీచకులుగా మారారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మలతో కలిసి మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచకపర్వం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితులపైనే కేసులు పెట్టటం, బెదిరింపులకు పాల్పడడం దారుణం అన్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రజా ప్రతినిధులే అఘాయిత్యాలకు పాల్పడుతూ పశువుల్లా వ్యహరిస్తే.. ఇక మహిళలకు న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నించారు. ఒక మహిళ బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని చెబితే న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని ప్రభుత్వ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు విజయనిర్మల మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ బాధిత మహిళకు అండగా ఉంటుందని, టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ వలంటీర్స్ వింగ్ జిల్లా అధ్యక్షురాలు భోగిశెట్టి పార్వతి, జిల్లా మహిళ కార్యదర్శి అచ్యుతకుమారి, జిల్లా కార్యదర్శి కే.తులసీ, మహిళ నాయకురాలు కుమారి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి స్రవంతి


