వైఎస్సార్‌సీపీ విజయానికి సైనికుల్లా పనిచేయాలి
కై కలూరు: వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశం బుధవారం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించారు. డీఎన్నార్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకులు పూర్తి వివరాలతో డిజిటలైషన్ చేయించుకోవాలన్నారు. పార్టీ గుర్తింపు కార్డులు ప్రతి ఒక్కరి వద్ద ఉండాలన్నారు. పార్టీ అనుంబంధ కమిటీలను అందరూ పూర్తి చేయాలన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరు సునీల్ కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోమటి విష్ణువర్థన్, పార్టీ ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు రెండో రోజు మొత్తం 1312 మంది హాజరయ్యారు. జిల్లాలోని 10 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉదయం 806 మందికి 678 మంది హాజరుకాగా 128 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 696 మందికి 634 మంది హాజరు కాగా 62 మంది గైర్హాజరయ్యారు.


