ముసునూరు: ప్రజావసరాలు, ఇసుక కొరత, మెత్తని ఇసుక లభ్యత, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఆసరాగా పంచాయతీ పేరు చెప్పి కొందరు ఇసుక రీచ్‌ల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో ఉచితంగా లభించాల్సిన ఇసుక ఖరీదైన వనరుగా మారుతోంది. మండలంలోని యల్లాపురంలోని రీచ్ వద్ద మెత్తని ఇసుక లభించడంతో అక్రమ వసూళ్ల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. అక్రమ ఇసుక రవాణా సహించం, నియమిత వేళల్లోనే తోలకాలు, లోడింగ్ చార్జీ రూ.400 మాత్రమే, సీనరేజ్ లేదు, ఇసుక కోసం ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు, పూర్తిగా ఇసుక ఉచితం, అతిక్రమిస్తే వాహనాలు సీజ్ చేస్తామన్న రాష్ట్ర మంత్రి మాటలు నీటి మీద రాతలే అయ్యాయి.
రోజుకు రూ.20 వేలకుపైగా..
మండలంలోని వలసపల్లి, యల్లాపురం రేవులతోపాటు తమ్మిలేరు పరివాహక గ్రామాలైన లోపూడి, గుళ్లపూడి, గుడిపాడు, బలివే, వెంకటాపురం గ్రామాల్లోని రేవుల నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలుతోంది. యల్లాపురం రేవులో ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, కట్టుడుకు అనువైన మెత్తని ఇసుక లభిస్తోంది. దీంతో పలు ప్రాంతాల నుంచి రోజుకు 200 ట్రాక్టర్లు వరకు ఇక్కడకు వస్తున్నాయి. దీనిని ఆసరాగా తీసుకుని రీచ్ వద్ద ముఠా లోడింగ్ కూలి రూ.500కు పెంచారని, పంచాయతీ పేరు చెప్పి మరో రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత రహదారి పక్కన వసూళ్లు చేయగా, తర్వాత రేవులో లోడైన మరుక్షణం వసూలు చేసేవారు. దీనిపై మీడియా వరుస కథనాలతో రూట్ మార్చి ముఠా కూలి చెల్లించే సమయంలో మేసీ్త్ర ద్వారా లోడింగ్ చార్జీ రూ.500తోపాటు, పంచాయతీ పేరుతో రూ.100 వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇలా రో జుకు రూ.20 వేలకు పైగా అక్రమార్కులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. దీనిపై తహసీల్దార్ పురుషోత్తమశర్మను వివరణ కోరగా మళ్లీ అధిక వసూళ్లు చేస్తున్నారనే విషయం తమ దృష్టికి రాలేదని సోమవారం రీచ్‌లకు సిబ్బందిని పంపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కొనసాగుతున్న ఇసుక దందా
లోడింగ్ ముఠా ద్వారా వసూళ్ల పర్వం