
వర్షాకాలంలో విద్యుత్‌తో అప్రమత్తం
తణుకు అర్బన్: వర్షాకాలంలో విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు వృక్షాలు కూలినప్పుడు, విద్యుత్ తీగలు తెగిపడినప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులకు తెగిపడుతున్న విద్యుత్ తీగలు తగిలి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గృహాల్లో సైతం తడిచేతులతో స్విచ్‌లు వేయడం, వర్షాలకు స్విచ్ బోర్డులు తడిసి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వంటివి చూస్తున్నాం. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. వర్షాకాలం మొదలైనా ఇంతవరకు విద్యుత్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
వర్షాల సమయంలో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● భారీ వర్షాల సమయాల్లో గృహోపకరణాల స్విచ్‌లు ఆఫ్ చేసి ఉంచాలి.
● కరెంటు స్విచ్ బోర్డుల్లో స్విచ్‌లను తడి చేతులతో తాకరాదు.
● చిన్న పిల్లలను కరెంటు వస్తువులకు దూరంగా ఉంచాలి.
● ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్స్ కట్ అయినా తాకకుండా వెంటనే విద్యుత్ శాఖకు తెలియచేయాలి.
● విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను తాకరాదు.
● ఇంటి పరిసరాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయిన సందర్భాల్లో దగ్గరకు వెళ్లకుండా ముందుగా విద్యుత్ శాఖకు తెలియచేయాలి.
● గృహాల ఆవరణలోని నీళ్ల మోటార్లకు ఉన్న కరెంటు వైర్లను తాకరాదు.
● గాలి, వాన సమయాల్లో కరెంటు లైన్ల కింద నిలబడడం, కూర్చోవడం చేయరాదు.
● రహదారుల్లో విద్యుత్ ప్రసారం జరిగే తీగలు తెగి పడి ఉంటే విద్యుత్ ప్రవాహం ఉన్నట్లుగా భావించి దూరంగా ఉండాలి.
● మోటార్ల స్టార్టర్లు, మోటార్లు వర్షం వలన నీటిలో మునగడం, పూర్తిగా తడవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. రైతులు జాగ్రత్తలు పాటించాలి.
● విద్యుత్ ప్రమాదానికి గురైన వారిని కానీ ఆ విద్యుత్ పరికరాన్ని కానీ నేరుగా తాకరాదు.
● వర్షాలు పడుతున్న సమయాల్లో రహదారులపై ఉన్న విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదు.
● విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్‌ప్రీ 1912 నంబరులో సంప్రదించాలి.