
విద్యాసంస్థల్లో ఆంక్షలపై నిరసన
భీమవరం: విద్యా సంస్థల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా మరెవరికీ ప్రవేశంలేదంటూ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేచ్చను, ప్రజాస్వామిక హక్కులను హరించేలా ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ విమర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ సోమవారం భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యా కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు మూలంగా విద్యార్థులు తమ స్వేచ్ఛను కోల్పోతారని వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లే వారికి ఈ ఉత్తర్వుల ద్వారా అనుమతులుండవన్నారు. ఉత్తర్వులు ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపారం, అన్యాయాలను బయటకు తీసే అవకాశం లేకుండా పోతుందని గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్వులను ఉపసంహరించకపోతే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మణ్, బి.సింధు, సాయికృష్ణ, హేమంత్, భాగ్యలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
ఆంక్షలు విరమించుకోవాలి
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జీవోను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసి కమిటీ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికీ అనుమతి లేదంటూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలపై, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ దశాబ్దాలుగా విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యారంగంలో గాని విద్యార్థులకు గాని సమస్యలు వస్తే తాము తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఏ పట్టణ అధ్యక్షుడు మేడవాల రాజా, తానేటి రంజిత్ కుమార్, సిహెచ్ గణేష్, జి.భానుప్రకాష్, టి.మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

విద్యాసంస్థల్లో ఆంక్షలపై నిరసన