
సీహెచ్‌ఓలపై చిన్నచూపు
పెంటపాడు: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌ఓ)లు నిరాదరణకు గురవుతున్నారు. గత జగనన్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియమితులైన వీరిని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగ భద్రత లేక, సకాలంలో జీతాలు అందక, సేవలు అందిస్తున్నా సరైన గౌరవం దక్కక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 368 సీహెచ్‌ఓలు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య సేవలో భాగంగా వీరికి 2019 నుంచి పోస్టులు మంజూరయ్యాయి. పీహెచ్‌సీల కన్నా మొదట వీరు ప్రాథమికంగా వైద్యనిర్ధారణ చేసి వ్యాధి తీవ్రతను బట్టి కేసులపై అధికారులకు రిఫర్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 14 రకాల సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య సర్వే, ఫ్యామిలీ హెల్త్ ఆరోగ్య సేవలు, ఇంటింటికీ సేవలతో పాటు, అంగన్‌వాడీ ప్రధానంగా గ్రామీణ ప్రజలకు చేరువగా ఉంటున్నారు. అయినా వారిని పాలకులు పట్టించుకోవడం లేదు. కమ్యూనిటీ హెల్త్ అధికారుల యూనియన్ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ మే నెలలో ఒక నెల పాటు పలు ప్రాంతాలోల సీహెచ్‌వోలు నిరసనలు తెలిపారు. కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినా వీరి సమస్యలు నేటికీ తీరలేదు.
ప్రధాన డిమాండ్‌లు
● ఆరేళ్లు పూర్తయిన కమ్యూనిటీ హెల్త్ అధికారులు (సీహెచ్‌ఓ)లను తక్షణం క్రమబద్ధీకరించాలి.
● ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
● జీతాలతో పాటు, ఇన్సెంటివ్‌లు అందించాలి.
● గ్రామాల్లో ప్రభుత్వ క్లినిక్‌ల అద్దెలను సకాలంలో చెల్లించాలి.
రేషనలైజేషన్ పేరుతో కుదింపు చర్యలు
వీరిని రేషనలైజేషన్ పేరుతో కుదించేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సీహెచ్‌ఓలు మనోవేదనకు గురౌతున్నారు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఒక సీహెచ్‌ఓను నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషలైజేషన్‌లో భాగంగా ఏ ప్రాతిపదికన ఈ చర్యలు చేస్తున్నారో తెలియడం లేదని చెబుతున్నారు. పేదలకు ఆరోగ్యం కోసం పాటు పడుతున్న వీరిని ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారం. పొరుగురాష్ట్రాల్లో సీహెచ్‌వోల సేవలను అక్కడి పాలకులు గుర్తించారు. మన రాష్ట్రంలో వీరిని పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది.
సమ్మె చేసినా పట్టించుకోని కూటమి ప్రభుత్వం
హామీలు అమలు చేయాలని డిమాండ్
గ్రామంలోనే సేవలు
ఎంతో దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మా గ్రామంలోనే మందులు అందిస్తున్నారు. ప్రభుత్వం వారి సేవల్ని గుర్తించడం లేదు.
– కె. వెంకట్రావు, అలంపురం
సకాలంలో వైద్య సేవలు
108,104 కన్నా రోజు మా గ్రామంలో ఆరోగ్యసేవలు అందిస్తున్న సీహెచ్‌ఓ వల్ల మాకు ఎంతో మేలు కలుగుతోంది. మందులు సకాలంలో అందిస్తున్నారు.
జయవరపు విజయదుర్గ, అలంపురం

సీహెచ్‌ఓలపై చిన్నచూపు

సీహెచ్‌ఓలపై చిన్నచూపు