జంగారెడ్డిగూడెం: పొగాకు రైతులు అధైర్య పడవద్దని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్ బాబు అన్నారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల పరిధిలోని జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి మండలాల్లోని వర్జీనియా తోటలను ఆయన పరిశీలించారు. కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడి పంట నష్టం అంచనాలను వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రం అధికారులను పంట నష్టం అంచనాలు వేసి గుంటూరు కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1, –2 రైతు సంఘం అధ్యక్షులు సత్రం వెంకట్రావు, పరిమి రాంబాబు మాట్లాడుతూ భారీ వర్షాలు, వడగండ్లకు వేలాది ఎకరాలు దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో వడగండ్లు పడి ఆకు మొత్తం పాడైపోయిందన్నారు. ఈ ఏడాది మంచి ధర పలుకుతుందని, సమస్యలు గట్టెక్కుతాయని భావించి పెట్టుబడులు పెట్టిన రైతులకు ఈ వర్షాలు నష్టాన్ని కలిగించాయన్నారు. ఆకు రెల్పు ప్రారంభం కాని తోటలు చెరువులుగా మారగా, ఈదురు గాలులకు క్యూరింగ్ జరుగుతున్న బ్యారన్ రేకులు ఎగిరిపోయి పొగాకు తడిచిపోయిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.3 లక్షలు అందించి ఆదుకోవాలని కోరుతూ పొగాకు బోర్డు ఈడీ శ్రీదర్‌బాబుకు విన్నవించినట్లు తెలిపారు. రైతు నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, సత్రం వెంకటరావు, వామిసెట్టి హరిబాబు, అట్లూరి సతీష్, వీవీఎస్ ప్రకాశరావు, ఎల్లిన వెంకటేశ్వరరావు, బోర్డు సెక్రటరీ, ప్రొడక్షన్ మేనేజర్, ఒంగోలు ఆర్‌ఎం కృష్ణశ్రీ, రాజమండ్రి ఆర్‌ఎం డీఎల్‌కే ప్రసాద్, ఎస్‌జీవో శకుంతల, జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల అధికారులు శ్రీహరి, సురేంద్ర, ఎస్‌జీఓలు సుధీర్, పార్వతి, ఫీల్డ్ ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సన్న, చిన్నకారు రైతులు పాల్గొన్నారు.


