ఏపీ వేరియంట్‌: ఎ రియల్‌ విలన్‌! | Sakshi
Sakshi News home page

ఏపీ వేరియంట్‌: ఎ రియల్‌ విలన్‌!

Published Sun, May 9 2021 12:15 AM

Vardhelli Murali Article On AP Variant - Sakshi

యుద్ధ సందర్భం. భారతీయులమైన మనం మన రాజ్యాంగ నిర్మాతలెవరూ ఊహించని ఒక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొం టున్నాము. ఒకానొక భయానక వాతావరణం జనం మస్తిష్కా లను స్వాధీనం చేసుకుంటున్న సందర్భం. ఈ పరిస్థితి తలెత్తడా నికి చాలా కారణాలు ఉండవచ్చును. అవి మానవ కల్పిత కార ణాలు కూడా కావచ్చును. పాలకుల వైఫల్యాలూ కారణం కావ చ్చును. జనం నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా నిందించవచ్చును. మనల్ని ఇన్ని ఇక్కట్లపాల్జేస్తున్న దుస్థితి కారణాలపై ఆరా తీసే సమయం ఒకటి త్వరలో వస్తుంది. అప్పుడు ఈ పాపాన్ని ఎవరె వరికి ఎంత చొప్పున పంచి ఇవ్వాలో జనం లెక్క తేలుస్తారు. ప్రస్తుత తక్షణ కర్తవ్యం మాత్రం యుద్ధంలో గెలవడమే. శత్రు దేశాలతో యుద్ధాలు తలెత్తినప్పుడు జాతియావత్తు ఒక్కటై నిలవడం మనకు కొత్తకాదు. ఇప్పుడు కనిపించని శత్రువుతో మొత్తం ప్రపంచమే యుద్ధం చేస్తున్నది. ఈ ప్రపంచయుద్ధంలో పీకల్లోతు మునిగివున్న టార్గెట్‌ నంబర్‌వన్‌ మన దేశమే. మనం మరింత ఐక్యంగా నిలబడాలి. ఇదొక చారిత్రక అవసరం.

కోవిడ్‌పై జరుగుతున్న యుద్ధ వ్యూహాలను సమీక్షించడానికి రెండు రోజుల క్రితం భారత ప్రధానమంత్రి కొందరు ముఖ్య మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. వీరిలో జార్ఖండ్‌ ముఖ్య మంత్రి హేమంత్‌ సోరెన్‌ కూడా ఉన్నారు. ప్రధానమంత్రితో సంభాషణ తర్వాత ట్విట్టర్‌లో సోరెన్‌ తన కామెంట్‌ పెట్టారు. ‘ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో ఆయన మన్‌కీ బాత్‌ తప్ప పెద్ద విషయమేమీ లేదంటూ’ వెటకారం ధ్వనించేలా ఆ కామెంట్‌ ఉన్నది. దీనిపై ట్విట్టర్‌ వేదికగా చాలామంది ప్రము ఖులు తమ అసహనాన్ని, అసమ్మతినీ వ్యక్తపరిచారు. వీరిలో అధికార పార్టీ ముఖ్యులు సహజంగానే ఉంటారు. కానీ కొందరు ప్రతిపక్ష నేతలు కూడా సోరెన్‌ వైఖరిని ఖండించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ట్విట్టర్‌ వేదికగానే ఆయన సోరెన్‌కు బదులిచ్చారు. ‘ప్రియమైన సోరెన్, మీరంటే నాకెంతో గౌరవం ఉన్నది. కానీ, ఒక సోదరుడిగా చెబు తున్నా... మన మధ్యన ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు గాక, వాటినిప్పుడు ప్రదర్శించడం భావ్యం కాదు. అది మన జాతిని బలహీనపరుస్తుంద’ని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు రాజకీయవేత్తలను మినహాయిస్తే వైఎస్‌ జగన్‌ స్పందనపై నెటి జన్ల నుంచి పెద్దఎత్తున సానుకూలత వ్యక్తమైంది.

సోరెన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టినప్పటికీ, కేంద్రం తీరుపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఏ ఫిర్యాదు లేదని చెప్పడానికి ఎటు వంటి ఆధారమూ లేదు. తమకు నెలకు కోటి డోసుల చొప్పున వ్యాక్సిన్లు కావాలని కేంద్రాన్ని పలుమార్లు అడిగారు. స్వయాన ముఖ్యమంత్రే రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారు. రోజుకు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగలిగే యంత్రాంగం తమకు ఉన్నదని ఒకరోజు ప్రదర్శించి మరీ చూపెట్టారు. పద్దెనిమిదేళ్ల వయసు దాటిన వారికి రెండు డోసుల చొప్పున ఇవ్వడానికి 6 కోట్ల 96 లక్షల డోసులు రాష్ట్రానికి కావాలి. కానీ ఇప్పటివరకూ కేంద్రం అందజేసింది కేవలం 73 లక్షల డోసులు. నాలుగు నెలల కాలంలో మొత్తం జనాభాకూ టీకాలు వేయగల వ్యవస్థాగత సామర్ధ్యం ఉన్నప్పటికీ, వాటి కేటాయింపూ, నియంత్రణాధి కారం కేంద్రం చేతిలో ఉన్న కారణంగా నిస్సహాయంగా ఉండి పోవలసి వస్తున్నదనే ఆవేదన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అట్లాగే రెమ్‌డెసివిర్‌ వంటి ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌ సిలిండర్ల విష యంలోనూ అవసరానికీ, సరఫరాకు మధ్యన వందశాతం తేడా ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతూ సంక్షో భాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ యుద్ధం జరుగుతున్న వేళ జాతి ఐక్యత విచ్ఛిన్నం కాకూడదనే వైఖరినే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసు కున్నారు. ఈ వైఖరి దేశ ప్రజలకు ఒక కొత్త సందేశాన్ని అంద జేసింది.

సంక్షోభ సమయాల్లోనే మనిషి అసలు స్వభావం బయట పడుతుందంటారు. విభేదాలు పక్కనబెట్టి జాతి యావత్తూ ఐక్యంగా నిలబడాలన్న రాజనీతిజ్ఞతను వైఎస్‌ జగన్‌ వ్యక్తపరిస్తే, ఇందుకు పూర్తిగా విరుద్ధమైన వైఖరి ఆయన రాజకీయ ప్రత్యర్థి నుంచి వ్యక్తమైంది. కోవిడ్‌పై పోరాటం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై నిత్యం నిందారోపణలు చేస్తూ ఫక్తు స్వార్థ రాజ కీయవేత్త స్వభావాన్ని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఎల్లో మీడియా సహకారంతో ఆయన, ఆయన పార్టీ చేపట్టిన తప్పుడు ప్రచారం అన్నిరకాల సభ్యతా ప్రమాణాలను దాటిపోయింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తే బాగుండును, రాష్ట్రం అల్లకల్లోల మైతే బాగుండును, ఈ ప్రభుత్వం పడిపోతే, చంద్రబాబును ఏ అదృశ్యశక్తో అధికారంలో కూర్చోబెడితే బాగుండును... అనే ధోరణిలో ఆ పార్టీ ఆలోచన సాగుతున్నది. ఈ అభిప్రాయాలను వాళ్లేమీ దాచుకోలేదు. స్వయానా చంద్రబాబు, ఆయన ప్రతినిధులూ మీడియా సమావేశాల్లో వెళ్లగక్కిన అవాకులే ఇవన్నీ. ఏపీ వేరియంట్‌ పేరుతో ఒక ప్రమాదకరమైన వైరస్‌ మ్యూటెంట్‌ కర్నూలులో కనిపించిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైనదనీ, పదిహేను రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తుందనీ చంద్రబాబు నిరాధారపూరితమైన తప్పుడు ప్రచారాన్ని లేవదీశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలం గాణ ప్రజలు మా రాష్ట్రాలకొస్తే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని పక్కరాష్ట్రాలు ప్రకటించాయి. చంద్రబాబు ప్రచా రాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలతో సహా పలువురు వైద్యనిపుణులు ఖండించారు. తనను అధికారానికి దూరం చేసిన ప్రజల మీద ఆయన కక్షబూనారేమోననిపిస్తున్నది. లేకపోతే జనంలో కల్లోలా నికి దారితీసే ఇటువంటి ప్రచారాన్ని ఇంత బాధ్యతారాహి త్యంతో ఎలా చేపట్టగలుగుతారు? తనకు దక్కని యువతి మరొకడికి దక్కకూడదంటూ యాసిడ్‌ చల్లే ప్రేమోన్మాదానికి, ఈ దుష్ప్రచారానికి తేడా ఏమైనా ఉన్నదా? మా నాయకుడికి ఒక వారం రోజులు అధికారం ఇచ్చి చూడండి అంటూ ఆ పార్టీ ప్రతి నిధులు మీడియా సమావేశాల్లో దేబిరించేందుకు దారితీసిన నిస్పృహకు కారణాలేమిటి? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభానికి దారితీసిన చారిత్రక పరిణామాల్లోనే ఈ స్వార్థ రాజకీయ శక్తుల కేరాఫ్‌ అడ్రస్‌ కూడా కనిపిస్తుంది. వాటి నేటి నిస్పృహకు కారణాలూ కనిపిస్తాయి.

బ్రిటీష్‌వాళ్లు మన ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పిచేసిన కారణంగా స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆరోగ్య రంగానికి మన దేశం పెద్దగా కేటాయింపులు చేయలేకపోయింది. జీడీపీలో ఒక్కశాతం మాత్రమే ఖర్చుపెట్టేవాళ్లు (ప్రభుత్వ వ్యయం ఇప్పుడు కూడా అంతే). అయినప్పటికీ పరిమిత సంఖ్యలోనైనా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండేవి. అందులో డాక్టర్, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేవాళ్లు. అత్యవసర మందులు లభ్యమ య్యేవి. ప్రతి గ్రామంలోనూ ఒకరో ఇద్దరో సంప్రదాయ వైద్యులు ఉండేవాళ్లు. ఊళ్లో ఎవరికి ఏ జబ్బు ఉందో, ఏ వైద్యం అవసరమో వీరికి తెలిసేది. జాతీయోద్యమం, సేవాభావాలతో ప్రభావితులైన కొత్తతరం డాక్టర్లు క్రమంగా చిన్నపట్టణాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులను నెలకొల్పారు. గ్రామీణ సంప్రదాయ వైద్యులు ఆర్‌ఎంపీలుగా, పీఎంపీలుగా రూపాంతరం చెందారు. వారికి పట్టణాల్లోని డాక్టర్లు కనీస వైద్యరీతులపై ఆధునిక శిక్షణ ఇచ్చేవారు. వైద్యునికి–రోగికీ మధ్యన ప్రత్యక్ష సంబంధం కొన సాగింది. వైద్యం ప్రజలకు తలకు మించిన భారంగా పరిణమిం చలేదు. ముప్పయ్యేళ్ల కింద దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారం భమయ్యేంతవరకూ ఈ పరిస్థితి కొనసాగింది.

ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరగడం మొదలైంది. పెరుగుతున్న సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం మొదలైంది. విద్య, వైద్యం సహా సమస్త జీవన రంగాలు వ్యాపార చట్రంలో బిగుసుకొని పోయాయి. కార్పొరేటీకరణ పొందిన వైద్యం పల్లెల్లో కనుమరు గైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాడుబెట్టారు. డాక్టర్లను, సిబ్బందిని నియమించలేదు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు పేషెం ట్లను తీసుకొని వచ్చే కమీషన్‌ ఏజెంట్లుగా ఆర్‌ఎంపీలను, పీఎంపీలను మార్చివేశారు. సంప్రదాయ వైద్యం అప్పటికే అంత రించిపోయింది. దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా పట్టణాల్లోని పెద్దాసుపత్రికి వెళ్లితీరాల్సిన దిక్కుమాలిన పరిస్థితి నెలకొన్నది. రోగం వస్తే అప్పులపాలు కావడం తప్ప మరో దారి లేని రోజులు ఆరోగ్యశ్రీ వచ్చేవరకూ కొనసాగాయి. క్షీరసాగర మథ నంలో అమృతంతోపాటు హాలాహలం పుట్టినట్టే, ఆర్థిక సంస్క రణల ఫలితంగా సంపదతోపాటు స్వార్థం కూడా వృద్ధి చెందింది. నయా సంపన్నవర్గాలు సంపదను కేంద్రీకృతం చేసు కోవడానికి పోటీపడ్డారు. వీరికి అండగా ఒక నయా రాజకీయ నాయకత్వం పుట్టింది. కొత్త సంపన్నవర్గాలకు ఊడిగం చేయడం ఈ సరికొత్త రాజకీయ నాయకత్వం ప్రథమ కర్తవ్యం. ఈ నాయకుల సేవలకు మెచ్చి ప్రపంచ సంపన్నవర్గాలు వీరికి సంస్కరణల చాంపియన్‌లుగా బిరుదులిచ్చాయి. ఈ చాంపి యన్‌లలో అగ్రస్థానం అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుది. ప్రభుత్వరంగంలో కొత్త వైద్యకళాశాలలు రాకుండా, హాస్పిటల్‌లు తెరవకుండా, వైద్యులను భర్తీ చేయ కుండా, ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండా ప్రభుత్వ వైద్యరంగాన్ని పాడెపైకి చేర్చిన ఘనత, కార్పొరేట్‌ వైద్యసేవలో తరించిన కీర్తి ఆయనది. ఇప్పుడు మహమ్మారి విరుచుకుపడిన వేళ ప్రభుత్వ వైద్యరంగం చిగురుటాకులా వణికిపోవడానికి ఈ రాష్ట్రంలో ప్రధాన కారకుడు ఆయనే. ప్రభుత్వ వైద్యరంగం బలంగా ఉన్నట్లయితే ఇంతటి దారుణమైన పరిణామాలు సంభ వించేవి కావని ఇప్పుడు అందరూ చెబుతున్న మాట. 

ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా రెండేళ్ల కిందట వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బహుశా ఒక వారం కూడా గడవకపోవచ్చు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని పునరుజ్జీవింపజేసే ఆలోచన లతో ‘నాడు–నేడు’ పేరుతో ఒక విజన్‌ను వాళ్లతో ఆయన పంచు కున్నారు. అప్పటికింకా కరోనా ఊసు మనం వినలేదు. కానీ వైద్యం ప్రజలకు సంక్రమించవలసిన ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ అందుకోసం ఒక బృహత్తరమైన అభివృద్ధి ప్రణాళికను ఆయన తయారుచేసుకున్నారు. ప్రభుత్వరంగంలో 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రకటించారు. హుటాహుటిన 12 వేల మంది కొత్త వైద్యసిబ్బందిని నియమించారు. కోవిడ్‌ను ఎదు ర్కొనేందుకు చేసిన నియామకాలు అదనం. 108, 104 సేవల కోసం మండలానికి రెండు అంబులెన్స్‌లను కొత్తగా ప్రవేశ పెట్టారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్‌ క్లినిక్‌ ఉండే ఏర్పాటు చేశారు. మారుమూల పల్లెలోని ప్రతి కుటుంబం, ఆ కుటుంబం లోని ప్రతి సభ్యుడూ నిరంతరం వైద్యపర్యవేక్షణలో ఉండే విధమైన ‘ఫ్యామిలీ డాక్టర్‌’ వ్యవస్థ ఏర్పాటు తన తుది లక్ష్యమని అధికారులతో ముఖ్యమంత్రి తరచూ చెప్పుకొస్తున్నారు. ఈ సంక్షోభం దాపురించకపోయినట్లయితే ఈ దారిలో మరిన్ని అడు గులు వేసి ఉండేవారు. ఇప్పటికే ఏర్పాటయిన వ్యవస్థ కారణం గానే ఒకేరోజున 6 లక్షలమందికి రాష్ట్ర ప్రభుత్వం టీకాలు ఇప్పిం చగలిగింది. ఇప్పుడు కోవిడ్‌ సంక్షోభాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి ప్రతిరోగికీ ఉచిత వైద్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్న వాస్తవాలు. ఆర్థిక సంస్క రణల తర్వాత మూడు దశాబ్దాల కాలంలో సగం రోజులు చంద్రబాబే అధికారంలో ఉన్నాడన్నది వాస్తవం. ఆయన హయాం లోనే ప్రభుత్వ వైద్యరంగం శిథిలమైందన్నది నిఖార్సైన నిజం. భర్తకు జబ్బుచేస్తే భార్య పుస్తెలు, భార్యకు జబ్బు చేస్తే భర్త కిడ్నీలు అమ్ముకొని ఆస్పత్రుల బిల్లులు కట్టిన దౌర్భాగ్యపు రోజులను ఆయన కాలంలోనే చూశామన్నది ఒక కఠిన వాస్తవం. కొనఊపిరితో ఉన్న ప్రభుత్వ వైద్య రంగాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పునరుజ్జీవింపజేసింద న్నది దాచేస్తే దాగని సత్యం. నిప్పులాంటి ఈ నిజాల మీద ఎందుకు నివురుగప్పుతున్నారు? ఎందుకంటే, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక వేరి యంట్‌. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కొత్త రూపం. నయా సంపన్నవర్గాల ప్రయోజనాల కోసమే మ్యూటేట్‌ అయిన వేరియంట్‌. ఈ రాజకీయ వేరియంట్‌కు స్వార్థమే పరమార్థం. రాజధాని పేరుతో ప్రారంభించిన తమ ట్రెజర్‌ హంట్‌ ఆగి పోయిందన్న నిస్పృహతో ఆ వేరియంట్‌ అల్లాడుతున్నది. అరా చకంగా ప్రవర్తిస్తున్నది. ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. ఈ ఏపీ వేరియంటే ఇప్పుడు నిజమైన విలన్‌!


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement