బీటలువారిన ఒపెక్‌! | Sakshi Editorial On UAE Exit From OPEC | Sakshi
Sakshi News home page

బీటలువారిన ఒపెక్‌!

May 1 2026 12:59 AM | Updated on May 1 2026 12:59 AM

Sakshi Editorial On UAE Exit From OPEC

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకటి తలిస్తే జరిగేది ఎప్పుడూ మరోటి. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తే అది నాలుగురోజుల్లో పాదాక్రాంతమవుతుందని అంచనావేసుకుని ప్రారంభించిన యుద్ధం కాస్తా వికటించి ఆయన ఆ ఊబిలో కూరుకుపోయారు. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియని తరుణంలో పశ్చిమాసియాలో ఆయన ఉద్దేశించని పరిణామం సంభవించింది. మే 1 నుంచి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌)నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రకటించింది. దాన్నుంచి మాత్రమే కాదు... 2016లో ఏర్పడిన ‘ఒపెక్‌ ప్లస్‌’నుంచి కూడా వైదొలగనున్నట్టు తెలిపింది. ఒపెక్‌లో సభ్యత్వం తీసుకోని రష్యావంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఈ గ్రూప్‌ ఏర్పడింది. ఒపెక్‌ ప్రపంచ చమురు ఉత్పత్తుల పరిమాణాన్నీ, ఎగుమతుల్నీ, వాటి ధరల్నీ నిర్దేశిస్తున్న కీలక సంస్థ. ప్రపంచ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులు దానిపైనే ఆధారపడతాయి. ప్రపంచ పెట్రో ఉత్పత్తుల్లో ఒపెక్‌ వాటా మూడోవంతుకన్నా ఎక్కువ. ఒపెక్‌ నుంచి తప్పుకోవాలన్న యూఏఈ ఆలోచన చాలా పాతది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ ఇరాన్‌ యుద్ధంతో అది తుది నిర్ణయానికొచ్చింది.

ఒపెక్‌ సంస్థ ఆవిర్భావానికీ, విస్తరణకూ పాశ్చాత్య బహుళజాతి సంస్థల నిర్వాకం కారణం. చమురు దేశాలు ఎంత ఉత్పత్తి చేయాలో, ఏ ధర నిర్ణయించాలో అవి నిర్దేశించేవి. వాటి చెప్పుచేతల్లో ఉండటం ఇక సాధ్యంకాదన్న నిర్ణయానికొచ్చిన చమురు దేశాలు 1960 సెప్టెంబర్‌లో బాగ్దాద్‌లో సమావేశమై ఒపెక్‌ ఏర్పాటుకు తీర్మానించాయి. ఇరాన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనెజులా దేశాలు ఇందులో భాగస్వాములు. 1967లో యూఏఈ చేరింది. 1973లో అరబ్‌–ఇజ్రాయెల్‌ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్‌ తదితర దేశాల వైఖరిపై ఆగ్రహించిన ఒపెక్‌... చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తూ, ఆ దేశాలకు ఎగుమతుల్ని నిషేధించింది. దాంతో పెను సంక్షోభం ఏర్పడింది. అనంతరకాలంలో ఈ దేశాలన్నీ అమెరికాకు సాగిలబడ్డాయి. అది వేరే కథ!

ఒపెక్‌లో రాజుకుంటున్న అసంతృప్తికి సౌదీ పెద్దన్న పాత్ర పోషిస్తుండటం ఒక కారణం. ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలో అదే నిర్ణయించటంవల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని సభ్యదేశాల్లో ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. అందుకే 2019లో ఖతార్, ఆ మరుసటి ఏడాది ఈక్వెడార్, 2024లో అంగోలా సంస్థనుంచి వైదొలగాయి. ఆ వరసలో యూఏఈ నాలుగో దేశం. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి ఉత్పత్తిని నియంత్రించుకుంటూ, అది కోరుకున్న ధరలో ఉండేలా చూసుకోవటం ఒపెక్‌ అలవాటు. తన తొలి ఏలుబడిలో ఒపెక్‌ దేశాలపై ట్రంప్‌ తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. చమురు ధరలు పెంచుతూ ప్రపంచ ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే 2020లో కోవిడ్‌ సమయంలో పాతాళానికి పడిపోయిన చమురు ధరలతో దివాలా స్థితికి చేరిన అమెరికన్‌ సంస్థల్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిని తగ్గించమని ఒపెక్‌ను వేడుకున్నది కూడా ఆయనే. 

సౌదీ తీరుపై యూఏఈ ఆగ్రహంతో ఉండటానికి కారణం ఉంది. అది ప్రస్తుతం రోజుకు 35 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. తనకున్న సామర్థ్యంతో అంతకన్నా ఎక్కువ చేయగలిగినా, సౌదీ అరేబియా నిర్దేశిస్తున్న కోటా ఆటంకంగా ఉంది. వచ్చే ఏడాదికల్లా దాన్ని 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలంటే తప్పుకోవటమే ఉత్తమమని అది భావిస్తోంది. ఈలోగా ఇరాన్‌ యుద్ధం దాని సమస్యల్ని పెంచింది. గల్ఫ్‌ దేశాల్లో ఇరాన్‌ దాడుల్లో ఆ దేశమే అధికంగా నష్టపోయింది. కనుకనే ఈ బాదరబందీని వదుల్చుకోవాలని నిర్ణయించుకుంది. పర్యవసానంగా వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర మూడు శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా, దీర్ఘకాలంలోగానీ దాని అసలు ప్రభావం కనబడదు. యూఏఈ మిత్రదేశంగా భారత్‌కు ఈ పరిణామం లాభదాయకమే. కానీ ఒపెక్‌ ఎలాంటి ఆంక్షలు పెడుతుందో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లూ కలిసికట్టుగా ఉన్నట్టు కనబడిన గల్ఫ్, ఒపెక్‌ బీటలువారుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని తగ్గిస్తుంది. ఇరాన్‌ పాదాక్రాంతం మాటేమో గానీ... అమెరికాకు మున్ముందు ఇది సమస్యాత్మకం. 

Advertisement
 
Advertisement
Advertisement