ఎండుతున్న జలకళ | Sakshi
Sakshi News home page

ఎండుతున్న జలకళ

Published Tue, Apr 30 2024 12:17 AM

Sakshi Editorial On Summer Water scarcity

అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. 

ఏప్రిల్‌ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్‌ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.

దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. 

వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. 

దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. 

గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. 

ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. 

తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. 

నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్‌ జనరేషన్‌ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. 

ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. 

ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. 

Advertisement
Advertisement