రష్యాకు తత్వం బోధపడాలి! | Sakshi Editorial On Russia Ukraine War | Sakshi
Sakshi News home page

రష్యాకు తత్వం బోధపడాలి!

Jun 4 2025 6:01 AM | Updated on Jun 4 2025 6:01 AM

Sakshi Editorial On Russia Ukraine War

శాంతి సాధన కోసం తుర్కియేలో రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య చర్చలకు 24 గంటల ముందు ‘ఆపరేషన్‌ స్పైడర్స్‌ వెబ్‌’ పేరిట ఉక్రెయిన్‌ ప్రయోగించిన వందలాది డ్రోన్లు ఆదివారం రష్యా సైనిక స్థావరాలు అయిదింటిలో భారీ విధ్వంసం సృష్టించగలిగాయి. మరోవైపు రష్యా అంతకుముందూ, ఆ తర్వాతా ఉక్రెయిన్‌ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇలా పరస్పర దాడుల నేపథ్యంలో సోమవారం జరిగిన చర్చలు సహజంగానే గంటన్నరలో ముగిశాయి. 

కరచాలనాలు లేకుండా, కాల్పుల విరమణ ఊసెత్తకుండా యుద్ధఖైదీల మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకుని రెండు బృందాలూ నిష్క్రమించాయి. అయిదు స్థావరాలపై ఉక్రెయిన్‌ దాడులకు ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా మూడు చోట్ల దాడుల్ని నిరోధించగలిగామని రష్యా చెప్పుకుంటోంది. అందుకు భిన్నంగా తమ డ్రోన్లు రష్యాలోని 41 బాంబర్‌ విమానాలను ధ్వంసం చేశాయని ఉక్రెయిన్‌ వివరిస్తోంది. 

దానికి వేలకోట్ల నష్టం వాటిల్లిందని చెబుతోంది. రష్యా దాడుల పర్యవసానంగా ఈ మూడేళ్ల కాలంలో ఉక్రెయిన్‌ సైన్యం వేలాదిమందిని కోల్పోయింది. ఇలాంటి నష్టాలను పెద్ద దేశం కనుక రష్యా భర్తీ చేసుకోగలుగుతోంది. అందుకే నల్లసముద్రంలో రష్యా దూకుడును తగ్గించేందుకు ఉక్రెయిన్‌ పూర్తిస్థాయిలో డ్రోన్‌లను నమ్ముకున్నట్టు కనబడుతోంది. యుద్ధం మొదలైన తొమ్మిది నెలల తర్వాత ఉక్రెయిన్‌ తొలిసారి 2022 డిసెంబర్‌లో రష్యా భూభాగంలో దాడులు మొదలు పెట్టింది. 

ఈ మూడేళ్ల కాలంలో తన స్థావరాలు, ఇంధన డిపోలు, యుద్ధ విమానాల గోడౌన్లు పటిష్టం చేసుకోవటంలో రష్యా శ్రద్ధ పెట్టిన మాట నిజమే అయినా ఉక్రెయిన్‌ సైతం డ్రోన్ల వినియోగంలో తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే పనిలోబడింది. ఆ విషయంలో అది విజయవంతమైందని ఆదివారంనాటి దాడులు వెల్లడిస్తున్నాయి.  

ప్రత్యర్థి దేశం తమతో పోలిస్తే పిపీలకమని, తమది అగ్రరాజ్యం, సంపన్న దేశమని మిడిసిపడే పరిస్థితి వర్తమాన కాలంలో ఎవరికీ లేదని ఉక్రెయిన్‌ దాడి వెల్లడిస్తోంది. యుద్ధం తప్పనిసరైనప్పుడు అందుకు అనుగుణంగా లోతైన అధ్యయనం చేసి, ఎప్పటికప్పుడు తనను తాను తీర్చిదిద్దుకున్న పక్షమే దీటుగా నిలబడగలుగుతుంది. ఉక్రెయిన్‌ ఆ పని చేయగలిగిందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. 

యుద్ధం ప్రారంభించిందీ, దాన్ని వద్దు వద్దని ఎంతమంది చెబుతున్నా వినకుండా కొనసాగిస్తున్నదీ రష్యాయే గనుక అది ప్రస్తుత నష్టానికి తనను తానే నిందించుకోవాలి. చర్చలు ప్రారంభమయ్యాకైనా గౌరవప్రదంగా కాల్పుల విరమణకు సిద్ధమై తన డిమాండ్లేమిటో చెబితే వాటిపై ఉక్రెయిన్‌ వైఖరేమిటో తేటతెల్లమయ్యేది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినా, నిలిచిపోయిన యుద్ధాన్ని తిరిగి కొనసాగనీయరాదన్న ఆత్రుత అందరిలో వుండేది. 

అందువల్ల కొంత రాజీకి ఉక్రెయిన్‌ను ఒప్పించటానికి కూడా ప్రయత్నాలు సాగేవి. కానీ చర్చలకు ఒప్పుకున్నాక కాల్పుల విరమణ ఇంకా ఉనికిలోకి రాలేదన్న ఏకైక కారణంతో అది దాడుల్ని కొనసాగించింది. రష్యా దురాక్రమించిన భూభాగమంతా వెనక్కిస్తే తప్ప యుద్ధ విరమణ ఉండబోదని మొన్న జనవరి నెలాఖరున ఉక్రెయిన్‌ చెప్పటంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశానికి ఇకపై అమెరికా నిఘా సమాచారం అందబోదని ప్రకటించారు. 

తాజా దాడులు గమనిస్తే ఉక్రెయిన్‌ ఆ అవరోధాన్ని కూడా అధిగమించగలిగిందని అర్థమవుతుంది. పైగా రష్యా గడ్డపైకి ట్రక్కుల్లో డ్రోన్లు తీసుకెళ్లి, లక్ష్యాలను చేరుకోగానే అవి ఒక్కసారిగా ఎగిరి యుద్ధ విమానాలను ధ్వంసం చేసేలా పథకం రచించింది.

ఈ పరిణామానికి రష్యా ఎటూ ఆందోళన పడుతుంది. కానీ పాశ్చాత్య దేశాలు సైతం కంగారు పడక తప్పదు. ఎందుకంటే ఎవరి నిఘా సాయమూ లేకుండా చవగ్గా లభించే డ్రోన్లతో రష్యావంటి దేశంలో పెనువిధ్వంసం సృష్టించగలగటం మాటలు కాదు. తమ పొరుగునేవుండి, తమ ప్రోత్సాహంతో రష్యాను చీకాకు పర్చటానికి ముందుకొచ్చిన చిన్న దేశం సైనికంగా ఇంత పటిష్టం కావటం పాశ్చాత్య దేశాలు జీర్ణించుకోలేనిది. 

2014 మొదట్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా వుండిన విక్టర్‌ యెనుకోవిచ్‌ తమ కీలుబొమ్మ కాలేదని అతన్ని కుట్రపూరితంగా పడగొట్టి జెలెన్‌స్కీని ప్రతిష్టించింది పాశ్చాత్య దేశాలే. అందుకు అమెరికా సైతం దన్నుగా నిలబడింది. నాటోను తూర్పువైపు విస్తరించాలన్న ఆ దేశాల దురాలోచనే ఇందుకు కారణమని గ్రహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ దురాక్రమణకు తెరతీశారు. 

డ్రోన్‌ దాడుల్లో రష్యా కోల్పోయిన యుద్ధ విమానాలు టియూ–95, టియూ–160 విమానాలు. అవి క్రూయిజ్‌ క్షిపణుల్ని ప్రయోగించగల సామర్థ్యం వున్నవి. ఉక్రెయిన్‌ చెబుతున్నదే నిజమైతే రష్యా వైమానిక పాటవం 34 శాతం కోల్పోయిందని సైనిక నిపుణుల అంచనా. వీటిని తిరిగి సమకూర్చుకోవాలంటే వేలాది కోట్ల రూబుళ్ల వ్యయమవుతుంది. 

రష్యాకు తత్వం బోధపడినట్టేనా? తమ దాడులతోపాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షల తీవ్రతను పెంచాలన్నది జెలెన్‌స్కీ వాదన. కానీ అమెరికా కనుసన్నల్లో నడిచే ఆ దేశాలు అందుకు సిద్ధపడలేవు. యుద్ధాన్ని ప్రారంభించటం సులభమే, కొనసాగించటమూ పెద్ద కష్టం కాదు. కానీ ముగించటం అత్యంత క్లిష్టమైనది. 

ఇరుపక్షాలకూ అప్పటికే యుద్ధం ప్రతిష్టాత్మకంగా మారిపోతుంది. విరమణకు సిద్ధపడితే దేశాన్ని పాదాక్రాంతం చేశారన్న అపఖ్యాతి వస్తుంది. అలాంటి అవమానాన్ని దిగమింగటానికి జెలెన్‌స్కీ సిద్ధంగా వున్నా పుతిన్‌ ససేమిరా అనటమే ప్రస్తుత సమస్య. ఇప్పటికే ఎంతో జాప్యం జరిగింది. కనుక ఈ యుద్ధం ఆపటానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలి. తగిన హామీలిచ్చి పుతిన్‌ను ఒప్పించాలి. 

Advertisement
 
Advertisement
Advertisement