మెడలు వంచే మేటి తరుణం!

Sakshi Editorial On Lancet Recent Study On Covid 19

కరోనా వైరస్‌ మన మధ్య ఇక స్థిరపడబోతోందా? దాంతో మనిషి శాశ్వత సహజీవనం ఖరారై నట్టేనా? రాను రాను ప్రభావం తగ్గి మహమ్మారి కాస్త అంటువ్యాధిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయా? డెంగ్యూ, మలేరియా, ఇతర ఫ్లూ జ్వరాల్లాగే ఇదీ సాధారణమవుతోందా? ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. సమాధానం ఇదమి ద్దంగా చెప్పలేకపోవడానికి... తరచూ రూపం–స్వభావం మార్చుకుంటూ వైరస్‌ పుట్టిస్తున్న కొత్త వైవిధ్యాలు (వేరియంట్స్‌) ఒక కారణమైతే, వేర్వేరు దేశాల్లో, ప్రాంతాల్లో, కాలాల్లో వైరస్‌ ప్రభావా నికి తలెత్తుతున్న విభిన్న పరిణామాలు మరో కారణం!

కొన్ని చోట్ల వైరస్‌ వ్యాప్తి వేగంగా, ప్రభావం తీవ్రంగా, మరణాల రేటు అధికంగా ఉంటోంది. అదింకా ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. మరికొన్ని చోట్ల ప్రభావం తక్కువగా, వ్యాధి వ్యాప్తి, కేసుల సంఖ్య నామమాత్రంగా ఉంటోంది. వ్యాధి సోకిన వారు ఆస్పత్రిపాలు కావాల్సిన పరిస్థితులు కూడా అరుదుగానే వస్తున్నాయి. ఇందుకు, ఇతరేతర కారణాలతో పాటు రెండు డోసుల టీకా ప్రక్రియ పూర్తయి ఉండటం కూడా కారణమేనని పలు అధ్యయనాలు వెల్లడించాయి. యునైటెడ్‌ కింగ్డమ్‌కు చెందిన ‘లాన్సెట్‌’ అ«ధ్యయనంతో పాటు అమె రికా ‘వ్యాధి నివారణ–నియంత్రణ కేంద్రం’ (సీడీసీ) పరిశోధన ఫలితాలూ ఇదే చెప్పాయి.

విశ్వ వ్యాప్తంగా.. టీకాలిచ్చే ప్రక్రియలో వ్యత్యాసాలున్నాయి. ఇవి వైరస్‌ ప్రభావం హెచ్చు–తగ్గులకు కార ణమవుతున్నాయి. మరోపక్క, వైరస్‌ కొత్త వైవిధ్యాలు ఈ సమీకరణాలను తలకిందులు చేస్తున్న ఘటనలూ నమోదవుతున్నాయి. రెండు డోసులు తీసుకున్న వారినీ డెల్టా ప్లస్‌ పలుచోట్ల వేధించింది. అభివృద్ధి చెందిన సమాజాల్లో ఇది కొంత ఆందోళన రేపింది. రెండు డోసుల టీకా వేసుకొని కూడా వారు మూడో, నాలుగో (బూస్టర్‌) డోస్‌కు పరుగులు తీస్తున్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న, చెందని చాలా దేశాల్లో టీకా ప్రక్రియ ఇంకా మందకోడిగానే సాగుతోంది.

వ్యాధి వ్యాప్తి–ప్రభావాలు, మహమ్మారిని ఎదుర్కొనే ఉమ్మడి పోరు... ఇట్లా ఎలా చూసినా ఈ అంతరాలు, అసమానతలు మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) హెచ్చరిస్తూనే ఉంది. సామూహిక రోగ నిరోధకత బలపడేందుకు, వైవిధ్యాలకు వెళ్లనీకుండా వైరస్‌ను కట్టడి చేసేందుకు... ఏకరీతి టీకా విధానం మంచిదని ఆ సంస్థ భావన! కానీ, అమెరికా, చైనా, ఇజ్రాయిల్, బెహరాన్‌...  వంటి దేశాలు అధికారికంగానే బూస్టర్‌ డోస్‌కు అనుమతించాయి. ఇది, ఇప్పటికింకా రెండు డోసులు దక్కని వారిని కలతకు గురిచేస్తోంది. ‘రెండు డోసుల’ సామర్థ్యంపై పలువురిలో సందేహాలనూ రేపుతోంది.

ఇకపై అసంఖ్యాకంగా కరోనా వైరస్‌ వైవిధ్యాలకు గల ఆస్కారాన్ని శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇప్పటికే, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్‌... ఇలా పలు వైవిధ్యాలు వెలుగు చూశాయి. కోవిడ్‌ రెండో అలలో బి.1.621 వైవిధ్యం భారత్‌తో సహా పలు దేశాల్లో విధ్వం సమే సృష్టించింది. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, చివరకు చైనా కూడా డెల్టా ప్లస్‌తో కష్టాల నెదు ర్కొన్నాయి. ఇప్పుడు సి.1.2 గురించిన హెచ్చరికలు వస్తున్నాయి. గడచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 కోట్ల మంది కోవిడ్‌ వ్యాధిబారిన పడ్డట్టు లెక్కలున్నాయి.

45 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవి ప్రామాణిక లెక్కలు కావని, ఇంకా వెలుగుచూడని గణాంకాలూ ఉన్నాయని డబ్లు్యహెచ్‌వో కూడా అంగీకరిస్తోంది. స్థూలంగా ఒకవైపు కరోనా మహ మ్మారి ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా, మరోవైపు వివిధ దేశాల్లో రెండో, మూడో, నాలుగో అలలు చెలరేగుతున్నాయి. దీంతో మానవాళి భయాందోళనలు వీడి కొంతకాలంపాటు జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం మంచిదని వైరాలజిస్టులు, నిపుణులు చెబుతున్నారు. పరిణామాల్ని నిశితంగా గమనిస్తూ, కోవిడ్‌ నిబంధనావళిని విధిగా పాటిస్తూ, టీకా ప్రక్రియను వేగిర పరుస్తూ... ముందుకు సాగడం మంచిదనే స్థూలాభిప్రాయం వ్యక్తమౌతోంది. జీవితంతో పాటు జీవనోపాధులూ ముఖ్యమే కనుక ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే కార్యాచరణ వేగవంతం చేయాలనే సూచనలు వస్తున్నాయి.

భారత్‌లో బడులు, ఇతర విద్యాసంస్థలు చాలా వరకు మొదలయ్యాయి. వర్తక, వాణిజ్య, ఉత్పత్తి, సేవా, క్రీడా, వినోద కార్యకలాపాలూ క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. ఒకవైపు కోవిడ్‌–19 రెండో అల మందగిస్తూ, మూడో అల హెచ్చరికలు వస్తున్న సంధికాలమిది. అల రాకకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సంకేతాలూ ఉన్నాయి. కేరళ వంటి రాష్ట్రాల్లో అసాధారణ సంఖ్యలో కేసులొస్తున్నాయి.

రోజుకు 45–47 వేల కొత్త కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతుంటే, అక్కడే 30 వేలకు పైగా ఉంటున్నాయి. దేశంలో టీకాలిచ్చే ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేకున్నా... ఆశాజన కంగానైతే ఉంది. కిందటి వారం 4.5 కోట్ల డోసులు, ఒకే రోజు కోటికి పైగా డోసులు ఇచ్చి కొత్త ఆశలు కల్పించారు. మళ్లీ ఎందుకో ఈ ప్రక్రియ ఢీలా పడింది. వైద్యం, అందుకవసరమైన సదు పాయాల పరంగా ఒక నిర్దిష్ట వ్యవస్థ ఇప్పటికే ఏర్పడింది.

కేంద్ర వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ సంస్థలు తాజా సమాచారంతో ఎప్పటికప్పుడు విధివిధానాలు పురమాయి స్తుంటే, మూడో అల ఎదుర్కోవడానికి రాష్ట్రాలు సన్నద్దతతోనే ఉన్నాయి. ఇక పౌర సమాజం అప్ర మత్తంగా ఉండటమే ఎంతో ముఖ్యమైంది. నాణ్యమైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటిం చడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లతో శుభ్రత పాటించడం వంటి కోవిడ్‌ సముచిత వర్తన (సీఏబీ)తో ప్రతివ్యక్తీ వ్యవహరించి వైరస్‌ను బలహీనపరచాలి. మహమ్మారిని సాధారణ అంటువ్యాధి కింద మార్చే అవకాశాన్ని చేజారనీయొద్దు! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top