యూపీలో అత్యాచారాల పరంపర

Molestation On Women Increasing In UP - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో వెల్లడైన మరో అత్యాచార ఉదంతం అందరిలోనూ ఆగ్రహావేశాలు రగులుస్తోంది. గత నెలంతా ఆ రాష్ట్రంలోని లఖింపూర్‌ ఖేరి జిల్లాలో వరసగా నాలుగు అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి దర్యాప్తులు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. దుండగులు పూర్తిగా పట్టుబడలేదు. ఈలోగా పక్షం రోజులక్రితం హత్రాస్‌ జిల్లాలోని గ్రామంలో పందొమ్మిదేళ్ల యువతి మనిషా వాల్మీకిపై నలుగురు దుండగులు మూకుమ్మడి అత్యాచారం చేసి, దారుణమైన చిత్రహింసలకు గురిచేశారు. ఆమె నాలుక కోసి, వెన్నెముక, గొంతు తీవ్రంగా గాయపరిచి వదిలిపోయారు. దాదాపు 15రోజులపాటు నరకం అనుభవించి సోమవారం రాత్రి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో మనిషా కన్నుమూసింది. ఆమెపై అత్యాచారం జరగడానికి ఒకటి, రెండు రోజుల ముందు లఖింపూర్‌ ఖేరి జిల్లాలోని గ్రామంలో 14 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి చెట్టుకు వేళ్లాడదీసి ఆమె ప్రాణాలు తీశారు.

దీనికిముందు మూడేళ్ల బాలికను కూడా ఇదే తరహాలో హింసించి చంపారు. మృగాళ్ల బారిన పడిన ఈ ఆడపిల్లల్లో అత్యధికులు దళితులు, వెనకబడిన కులాలవారని, నేరగాళ్లలో చాలామంది ఆధిపత్య కులాలవారని వేరే చెప్పనవసరం లేదు. చట్టాలు లేకపోవడం, వున్నా అవి కఠినంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయనుకోవడానికి లేదు. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత ఐపీసీ నిబంధనలకు సవరణలు చేస్తూ నిర్భయ చట్టం తీసుకొచ్చారు. అనంతరకాలంలో పిల్లలపై లైంగిక నేరాల నిరోధక(పోక్సో) చట్టంలో అత్యంత కఠినమైన శిక్షలు చేరుస్తూ సవరణ చేశారు. కానీ ఈ అత్యాచారాలు ఆగకపోగా, అవి నానాటికీ పెరుగుతున్నాయి. కనుక ఎక్కడ లోపం వున్నదో, ఏం చేస్తే ఈ దుర్మార్గాలు తగ్గుతాయో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక ఉదంతం జరిగినప్పుడు, అది అత్యంత అమానుషంగా వున్నప్పుడు సమాజం తీవ్రంగా స్పందిస్తుంది.

తక్షణ చర్యకు డిమాండ్‌ చేస్తుంది. 2012లో జరిగింది అదే. దేశ రాజధాని నగరంలో జరిగిన నిర్భయ ఉదంతంపై వెల్లువెత్తిన నిరసనలు పాలకుల్ని ఎంతగా కదిలించాయంటే... దేశ చరిత్రలో తొలిసారి ఉద్యమకారులు కోరిన విధంగా కఠినమైన చట్టం రూపొందించడానికి సంబంధించిన ప్రక్రియ వెనువెంటనే మొదలైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ వర్మ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ చురుగ్గా పనిచేసి స్వల్ప వ్యవధిలో తన నివేదిక అందజేసింది. అంతే ఉరుకులు పరుగులతో నిర్భయ చట్టం వచ్చింది. ఎనిమిదేళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూస్తే... దేశంలో అత్యా చారాలు తగ్గింది లేదు. నిర్భయ ఉదంతం చోటుచేసుకున్న ఢిల్లీలోనే 2012–2014 మధ్య 31,446 అత్యాచార ఉదంతాల గురించి ఫిర్యాదులొచ్చాయి. నేరగాళ్లలో దాదాపు 150మందికి శిక్ష పడింది. దురదృష్టకరమేమంటే దేశమంతా కొద్దో గొప్పో తేడాతో ఈ పోకడే కనిపిస్తోంది.

ఇప్పుడు అత్యాచార ఉదంతాలతో తరచుగా వార్తల్లోకెక్కుతున్న ఉత్తరప్రదేశ్‌లో లైంగిక నేరాలు అరికట్టడానికి 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని నిరుడు ఆగస్టులో అక్కడి ప్రభుత్వం చెప్పింది. ఏడాది గడిచాక చూస్తే కేవలం 206 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు మాత్రమే పనిచేస్తున్నాయి. పెండింగ్‌లో వున్న కేసుల సంఖ్య 4.25లక్షలు! కనుకనే నేరగాళ్లకు పట్టపగ్గాలుండటం లేదు. లైంగిక వేధింపుల ఆరోపణ లపైనా, అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదులపైనా పోలీసులు నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తున్నారని, అందువల్లే దోషులకు సరిగా శిక్షలు పడటం లేదని ఏడేళ్లక్రితం పార్లమెంటరీ సంఘం తేల్చింది. మరి కఠిన చట్టాలు తెచ్చి ప్రయోజనం ఏమిటి? నిర్భయ కేసునే ఉదాహరణగా తీసుకుంటే ఆ కేసులో దోషులు ఎనిమిదేళ్ల తర్వాత మొన్న మార్చిలో ఉరికంబం ఎక్కారు. 

విచారించదగ్గదేమంటే... అన్ని ఉదంతాల విషయంలోనూ సమాజం స్పందన ఒకేలా లేదు. నిర్భయ ఉదంతం జరిగినçప్పటి స్పందనతో పోలిస్తే ఇప్పుడు మనిషా ఉదంతం ఎవరికీ పట్టలేదు. ఈ ఘటన గురించి మీడియాలో గత వారం పదిరోజులుగా కథనాలు వెలువడుతున్నా... పోలీసులు దోషుల కొమ్ముకాస్తున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆక్రోశించినా అది అరణ్యరోదనే అయింది. కొన్ని దళిత సంఘాలు హత్రాస్‌లో, ఢిల్లీలో ప్రదర్శనలు నిర్వహించాయి. మనిషాకు న్యాయం జరగాలంటూ ధర్నా చేసిన ఆమె కుటుంబసభ్యుల్ని పోలీసులు చడీచప్పుడూ లేకుండా తరలించారు. దుండగుల చేతుల్లో మనీషా అనుభవించిన చిత్రహింసలు అన్నీ ఇన్నీ కాదు. దుండగులు దుపట్టాతో ఆమె గొంతు బిగించి ఈడ్చుకుపోయారు.

మనీషా ప్రతిఘటిస్తుంటే దారుణంగా హింసించారు. దుండగుల్లో ఒకడైన సందీప్‌కు వంశపారంపర్యంగా నేరచరిత్ర ఉంది. దళిత కులాల మహిళలను, బాలికలను తాగొచ్చి కించపరుస్తూ మాట్లాడటం, వేధించడం అతగాడికి నిత్యకృత్యం. రెండు దశా బ్దాల క్రితం సందీప్‌ తాత కూడా ఇదే మాదిరి మనిషా తాతను దూషించి ఎస్సీ, ఎస్టీ కేసులో కొద్ది కాలం జైలుకుపోయిన చరిత్ర వుంది.   మహిళలపై లైంగిక నేరాలు జరిగినప్పుడు పోలీసు విభాగం సత్వరం స్పందించడం, నింది తులను పట్టుకుని పకడ్బందీగా దర్యాప్తు జరిపి, సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చూడటం చాలా చాలా అవసరం.

నేరానికీ, శిక్షకూ మధ్య వుంటున్న అపరిమిత జాప్యాన్ని నివారించగలిగితేనే నేరగాళ్లలో భయం ఏర్పడుతుంది. తెలంగాణలో ఏర్పాటైన షీ టీమ్‌ వ్యవస్థగానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంగానీ మహిళలపై నేరాలు అరికట్టడానికి తోడ్పడతాయి. లైంగిక నేరాల కేసుల్లో దుండగులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించడానికి దిశ చట్టం వీలు కల్పిస్తోంది. ఆపదలో వున్నవారు వెనువెంటనే పోలీసులను సంప్రదించడం కోసం దిశ యాప్‌ కూడా తీసు కొచ్చారు. చాలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఇకనైనా చురుగ్గా వ్యవహరించి అత్యాచారాలను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top