జపాన్‌తో ‘మిత్రలాభం’ | Japanese Prime Minister Sanae Takaichi paid a three day visit to our country | Sakshi
Sakshi News home page

జపాన్‌తో ‘మిత్రలాభం’

Jul 4 2026 3:04 AM | Updated on Jul 4 2026 3:04 AM

Japanese Prime Minister Sanae Takaichi paid a three day visit to our country

శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్‌ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. 

ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్‌’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్‌ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్‌ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. 

శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్‌ మాస్ట్‌లను భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్‌ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.

అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్‌తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్‌తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.

కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్‌ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే.   

మన దేశానికి 1991 వరకూ జపాన్‌ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్‌ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్‌ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్‌ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్‌ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్‌ సంస్థలు 1,400 మించవు. 

ఇందుకుభిన్నంగా థాయ్‌లాండ్‌లో జపాన్‌ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్‌ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్‌ వాటాయే అధికం. మన జనరిక్‌ మందులపై జపాన్‌లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement