తగునా ఇది కాంగ్రెస్‌!

Congress Party National Herald Case Rahul Gandhi Sakshi Editorial

దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సోమవారం ‘సత్యాగ్రహ’ ఉద్యమంతో హోరెత్తించింది. ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించడం ఆ పార్టీకి ఆగ్రహం కలిగించింది. ఇదే కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఈడీ ప్రశ్నించాల్సి ఉంది. అయితే ఆమె అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడంతో సాధ్య పడలేదు. దశాబ్దాలపాటు దేశాన్నేలి ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు సమీప భవిష్యత్తులో గత వైభవం దుర్లభమని పదే పదే రుజువవుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నిర్వహించిన తాజా ఉద్యమం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈడీ, సీబీఐ, ఐటీ తదితర విభాగాలు అధికార పక్షానికి ప్రత్యర్థులైనవారిని వేధించడం రివాజుగా పెట్టుకున్నాయని చాన్నాళ్లుగా ఆరోపణ లున్నాయి. ఆ మాటకొస్తే అధికారంలో ఉండగా ఇలాంటి సంస్కృతికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్సే. సర్వోన్నత న్యాయస్థానమే ఒక సందర్భంలో సీబీఐని ‘పంజరంలో చిలుక’గా అభివర్ణించాల్సి వచ్చింది. అటువంటి పార్టీకి తమ నేత రాహుల్‌ గాంధీని ప్రశ్నించడం అభ్యంతర కరం అనిపిస్తోంది.

ఏ సమస్యపైన అయినా ఉద్యమించడం ఒక రాజకీయ పక్షంగా కాంగ్రెస్‌ హక్కు. కాదనలేం. కానీ పోయి పోయి ఎన్నో లొసుగులతో నిండివున్న ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసు విషయంలో ఇంతగా రాద్ధాంతం చేయడమేమిటన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. ‘నేషనల్‌ హెరాల్డ్‌’ చరిత్ర సమున్నతమైనది. కాంగ్రెస్‌ సారథ్యంలో సాగుతున్న స్వాతంత్య్ర సమరంలో దేశ ప్రజానీకాన్ని చైతన్యవంతులను చేయడం కోసం ఆ పత్రిక ఆవిర్భవించింది. ఎంతో సదాశయంతో ప్రారంభించిన ఆ పత్రిక చుట్టూ స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సంబరాలు సాగుతున్న వర్తమాన  తరుణంలో వివాదాలు ముసురుకోవడం బాధాకరమే. కానీ అందుకు పూర్తి బాధ్యత సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలదే.

సుదీర్ఘకాలం నడిచి మూతబడిన ‘నేషనల్‌ హెరాల్డ్‌’, దాని అనుబంధ పత్రికలైన క్వామీ ఆవాజ్‌ (ఉర్దూ), నవజీవన్‌ (హిందీ)ల విషయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరుపై అందరికన్నా ముందు నిలదీసింది బీజేపీ నేతలు కాదు... కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ. మేధావులుగా, నైతిక వర్తనులుగా పేరుప్రతిష్ఠలున్న వీరిద్దరికీ బీజేపీపై ఉన్న వ్యతిరేకత ఎవరికీ తెలియంది కాదు.

వారి అభ్యంతరాలను కాంగ్రెస్‌ బేఖాతరు చేసినప్పుడు దీన్ని న్యాయస్థానం వరకూ తీసుకెళ్లింది మాత్రం బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామే. ఆయన 2012లో న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయి ఉంటే ఈ అక్రమాలు వెలుగు చూసేవే కాదు. ఆ దశలోనైనా కాంగ్రెస్‌ మేల్కొనాల్సింది. అప్పటికి తానే అధికారంలో ఉన్నది కనుక సమగ్ర విచారణకు సిద్ధపడాల్సింది. తప్పని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుని అందరికీ ఆదర్శనీయం కావాల్సింది. కానీ కుంభకోణానికి మూలవిరాట్టులు తల్లీకొడుకులే అయినప్పుడు అదెలా సాధ్యం? 

‘నేషనల్‌ హెరాల్డ్‌’ నెహ్రూ కుటుంబ సొంతాస్తి కాదు. 1937 నవంబర్‌లో నెహ్రూ చొరవతో దాదాపు 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులు వాటాదారులుగా ఏర్పడిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) అనే సంస్థకు చెందిన పత్రిక. దాదాపు 5,000 కోట్ల ఆస్తులున్న ఆ సంస్థనుంచి తనకు రావాల్సిన రూ. 90.25 కోట్ల బకాయిలను వసూలు చేసుకునే నెపంతో కాంగ్రెస్‌ చేసిన ఇంద్రజాలం అసామాన్యమైనది. 2010లో రూ. 5 లక్షల మూలధనంతో యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌(వైఐఎల్‌) ఏర్పాటు చేయడమే కాదు... ఆగమేఘాలమీద ఏజేఎల్‌ ఆస్తులన్నిటిపైనా దానికి హక్కులు దఖలు పరిచేందుకు పథకం సిద్ధం చేశారు.

ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ పార్టీ రూ. 90 కోట్ల వడ్డీ రహిత రుణం ఇవ్వడం, ఆ రుణాన్ని వసూలు చేసుకునే హక్కును కేవలం రూ. 50 లక్షలకు వైఐఎల్‌కు కాంగ్రెస్‌ అమ్మడం, అందుకు బదులుగా ఏజేఎల్‌కున్న ఆస్తులన్నీ వైఐఎల్‌కు దఖలుపడటం ఏడాది వ్యవధిలో చకచకా జరిగిపోయాయి. వైఐఎల్‌లో సోనియా, రాహుల్‌ గాంధీలకు ఏకంగా 76 శాతం వాటాలుండటం... కాంగ్రెస్, ఏజేఎల్, వైఐఎల్‌ అనే మూడు సంస్థల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ సర్వం తానై వ్యవహరించింది కాంగ్రెస్‌ సీనియర్‌ నేత స్వర్గీయ మోతీలాల్‌ వోరా కావడం దిగ్భ్రమ కలిగిస్తుంది.

ఇది ఏజేఎల్‌తోపాటు తమ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను కూడా దగా చేయడమే. ఏజేఎల్‌కు 2011 నాటికి మిగిలివున్న 1,057 మంది వాటాదార్లలో ఒకరిగా శాంతిభూషణ్, కట్జూలు ఈ చాటుమాటు వ్యవహారాన్ని ప్రశ్నించారు. తమకు కనీసం నోటీసు ఎందుకివ్వలేదని నిలదీశారు. కానీ కాంగ్రెస్‌ మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాతైనా సచ్ఛీలతను నిరూపించుకోవాల్సింది పోయి స్టేలు తెచ్చుకుంది. దర్యాప్తును అడ్డుకోజూసింది.

స్వాతంత్య్రోద్యమంపైనా, అందులో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్‌పైనా, ప్రత్యేకించి నెహ్రూ పైనా ప్రస్తుత నాయకత్వానికి ఏమాత్రం గౌరవమర్యాదలున్నా ఇలాంటి సందేహాస్పద వ్యవహారా నికి తెరతీసేదే కాదు. వేలాదికోట్ల ఆస్తులున్న సంస్థను నిలబెట్టడానికి, పత్రికలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వందలాది కుటుంబాలను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే కాంగ్రెస్‌ ప్రతిష్ఠ ఇనుమడించేది.

అందుకు భిన్నంగా వక్రమార్గంలో పోవాలనుకోవడంతో ఆ పార్టీ నగుబాటుపాలైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. జరిగిందేమిటో, అందులో తన నిజాయితీ ఏపాటో కాంగ్రెస్‌ దేశ ప్రజల ముందుంచాలి. ప్రస్తుత దర్యాప్తు ఏరకంగా కక్ష సాధింపు అవుతుందో నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే కాంగ్రెస్‌ ప్రతిష్ఠ మరింత అడుగంటడం ఖాయం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top