గండం గట్టెక్కిన అమెరికా

America is strong from the crisis after corona pandemic - Sakshi

ఎట్టకేలకు ఒక పెను సంక్షోభం సమసిపోయింది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని మింగేసే మూడో ముప్పుగా ఆర్థిక నిపుణులు అభివర్ణించిన అమెరికా గరిష్ఠ రుణపరిమితి (డెబిట్‌ సీలింగ్‌) సంక్షోభంపై పాలక డెమాక్రాటిక్‌ పార్టీ, విపక్ష రిపబ్లికన్‌ పార్టీల మధ్య చివరి నిమిషంలో కుదిరిన అవగాహన పర్యవసానంగా కథ సుఖాంతమైంది. నిజానికి కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఊహించని రీతిలో వచ్చిపడ్డాయి. కానీ అమెరికా సంక్షోభం అలా కాదు. అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్‌ బాంబు మాదిరి కొన్ని నెలలుగా ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ముడిపడి ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా, అగ్రరాజ్యంగా ఉన్న అమె రికా తన ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా క్రమశిక్షణతో నడపలేకపోవటమే ఈ సమస్యకు మూలం. 

తొలిసారి 1917లో గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు అమెరికన్‌ కాంగ్రెస్‌ అనుమతించగా, ఆ తర్వాత 1939లో, 1941లో రుణ సేకరణకు ప్రత్యేక చట్టాలు చేయాల్సివచ్చింది. ఇక అది రివాజుగా మారింది. ఆ తర్వాత 2011 వరకూ 78సార్లు గరిష్ఠ రుణ పరిమితికి అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోద ముద్ర వేయాల్సివచ్చింది. అమెరికా ప్రస్తుత గరిష్ఠ రుణ పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లు కాగా, దాన్ని మరింత పెంచేందుకు ప్రతినిధుల సభ, సెనేట్‌ తాజాగా అంగీకరించాయి. రుణ పరిమితిని పెంచే బదులు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవాలంటూ మొన్న ఏప్రిల్‌లో రిపబ్లికన్‌ పార్టీ పట్టు బట్టడంతో జో బైడెన్‌ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. రిపబ్లికన్‌ల ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో బైడెన్‌ సర్కార్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌కు 4.8 లక్షల కోట్ల మేర కోత పెట్టే తీర్మానం ఏప్రిల్‌ నెలాఖరున ఆమోదం పొందింది. 

ఆ కోత తీర్మానం ద్వారా హరిత ఇంధన రంగ పెట్టుబడులకు ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న పన్ను మినహాయింపులకూ, విద్యార్థుల రుణాల మాఫీకీ రిపబ్లికన్‌లు మోకాలడ్డారు. ఈ చర్య అమెరికా పౌరులపైనా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా తుపాకి గురిపెట్టడంతో సమానమని అమెరికా ఖజానా మంత్రి జానెట్‌ యెలెన్‌ మండిపడ్డారు. ఆ మాటెలావున్నా ప్రతి నిధుల సభ, సెనేట్‌ల ఆమోదం లభించకపోతే ఆపద్ధర్మంగా బైడెన్‌ 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తనకు లభించే విశేషాధికారాలతో ప్రత్యేక చర్య తీసుకునే వీలుంటుంది. కానీ అది సంక్షోభాన్ని తాత్కాలికంగా ఒకటి రెండు నెలలు వాయిదా వేయగలదే తప్ప నివారించలేదు. ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అనిశ్చితిని పోగొట్టలేదు. అందుకే సమస్యకు పరిష్కారం సాధ్యమా కాదా అన్న సంశ యంలో ప్రపంచం పడిపోయింది. 

ఇరు పార్టీల మధ్యా ఒప్పందం కుదరకపోతే అమెరికా తన రుణాలను చెల్లించలేని స్థితిలో పడేది. టీచర్లు, పబ్లిక్‌ రంగ సంస్థల కార్మికులతో సహా లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు నిలిపేయాల్సివచ్చేది. పింఛన్లు, అనేకానేక సాంఘిక సంక్షేమ పథకాలు కూడా ఆపాల్సివచ్చేది. కేవలం తాను చెల్లించక తప్పని రుణాలకూ, వడ్డీ చెల్లింపులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సివచ్చేది. దాని సెక్యూరిటీలు పల్టీలు కొట్టేవి. సారాంశంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేది. 

ఒక అంచనా ప్రకారం స్వల్పకాల దివాలా అయినా కనీసం 5 లక్షల మంది ఉద్యోగులకు అది ముప్పుగా పరిణమించేది. మరింత కాలం కొనసాగితే అనేకానేక వ్యాపారాలూ మూతబడి 83 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యేవి. అంతేకాదు, అది కార్చిచ్చులా వ్యాపించి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేది. ఇరుపక్షాలూ పరిణతి ప్రదర్శించటం వల్ల ప్రస్తుతానికైతే అంతా సర్దుకుంది. కానీ మున్ముందు ఇదంతా పునరావృతం కాకమానదని గత చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యం అంచుల్లో ఉంది. కరోనా మహమ్మారి లక్షలాదిమంది ప్రాణా లను బలితీసుకోవటంతోపాటు మహా మహా ఆర్థిక వ్యవస్థలనే తలకిందులు చేసింది. దాన్నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు సాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పొరుగునున్న చిన్న దేశం ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగారు. 

కొన్ని నెలల్లో సమసిపోతుందనుకున్న ఆ దురాక్రమణ యుద్ధం ఏణ్ణర్థం నుంచి ఎడతెగకుండా సాగుతోంది. ఇదే అదునుగా రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికా యూరోప్‌ దేశాలన్నిటినీ ఏకం చేసి ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగా అండదండలందిస్తోంది. అదే సమయంలో రష్యాపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. తమ సమస్త అవసరాలకూ రష్యాపై ఆధారపడక తప్పని యూరోప్‌ దేశాలు ఈ ఆంక్షల పర్యవసానంగా ఒడిదుడుకుల్లో పడ్డాయి. జర్మనీ ఆర్థిక మాంద్యంలో పడింది. ఈలోగా గోరుచుట్టుపై రోకటి పోటులా ఈ రుణ గరిష్ఠ పరిమితి సంక్షోభం వచ్చిపడింది.

తన శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేస్తున్నవారికి రిపబ్లికన్‌లతో ఒప్పందం ద్వారా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి షాక్‌ ఇచ్చారు. రిపబ్లికన్‌లకు చెందిన ప్రతినిధుల సభ స్పీకర్‌ మెకార్తీ తన పార్టీలోని అత్యుత్సాహులను కట్టడి చేయగలిగారు. అయితే అమెరికా డాలర్‌తో, అక్కడి ఫైనాన్షియల్‌ మార్కెట్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ముడిపడివున్న సంగతిని ఆ దేశం మరువ కూడదు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు విశ్వసనీయత లేకపోవటంవల్ల తప్ప ఇందులో తన ప్రయోజకత్వం ఏమీ లేదని అది గుర్తించాలి. తాజా ఒప్పందం పర్యవసానంగా 2025 జనవరి వరకూ గండం గట్టెక్కినట్టే. ఆ తర్వాతైనా సమస్యలు తప్పవు. ఇప్పటికైనా అమెరికా సొంతింటిని చక్కదిద్దుకునే చర్యలు మొదలెట్టాలి. హద్దూ ఆపూలేని వ్యయానికీ, పన్నులకూ కళ్లెం వేసి హేతుబద్ధ విధానాలను రూపొందించుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top