కాసులకు కక్కుర్తిపఢీ | - | Sakshi
Sakshi News home page

కాసులకు కక్కుర్తిపఢీ

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

సాక్షి, అమలాపురం: అఖండ గోదావరితో పాటు ఏలేరు.. పంపా.. తాండవ నదీ పాయల మధ్య దొరికే ఇసుక, లంకల్లోని మట్టి.. మెట్ట ప్రాంతంలోని తూర్పు కనుమల్లో లభ్యమయ్యే బ్లాక్‌ మెటల్‌.. రెడ్‌ గ్రావెల్‌ ప్రభుత్వానికి ఆదాయం అందించడంతో పాటు అక్రమార్కులకు అక్షయపాత్రలుగా మారాయి. వీటి రవాణా సామాన్యులకు ప్రాణసంకటంగా పరిణమించింది. అనుమతి ఉన్న ర్యాంపుల నుంచే కాకుండా, అక్రమ తవ్వకాల ప్రాంతాల నుంచి ఇసుక, గ్రావెల్‌, మట్టి తరలింపు సమయంలో టిప్పర్లు, క్వారీ లారీలు, ట్రాక్టర్లు వేగంగా వెళ్లి ఢీకొనడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాలను బలిగొంటోంది. ట్రిప్పులు ఎక్కువ వేస్తే సొమ్ము ఎక్కువగా వస్తుందనే అత్యాశ.. పలువురి ప్రాణాలను మింగేస్తోంది. ఇలా అనేక ప్రమాదాల్లో మృతువాత పడినవారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అక్రమ ఇసుక, మట్టి రవాణా కోసం అర్ధరాత్రి రోడ్డెక్కుతున్న టిప్పర్లు, లారీల వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారం వారం పెను విషాదాలకు కారణమవుతున్నాయి.

రహదారుల్లో రక్తసిక్తం

● అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన విళ్ల గీతారాణి (24) గత నెల రెండో తేదీ తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో చనిపోయింది. తన తండ్రితో కలసి వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్న సమయంలో అతివేగంగా వస్తున్న టిప్పర్‌ వెనుక నుంచి ఢీకొంది. టిప్పర్‌ ఆమెను 30 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. తండ్రి వీర్రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలన్న ఆమె కలను కష్టపడి చదివి సాధించింది. మంచి కంపెనీలో ఉద్యోగం సైతం పొందింది. కానీ వీధి టిప్పర్‌ రూపంలో కాటేసింది.

● ఈ ఏడాది మార్చి 21న పి.గన్నవరంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఊడుమూడి గ్రామానికి చెందిన రైతు విళ్ల నాగేశ్వరరావు (63) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్‌ లారీని ఆపకుండా తిరిగి లంక గ్రామంలోకి వెళ్లి మట్టిని దించి అక్కడి నుంచి పరారయ్యాడు.

● అంబాజీపేట మండలం గంగలకుర్రు వంతెన వద్ద ఈ నెల 21వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో కొర్లపాటివారిపాలేనికి చెందిన నందెపు ప్రణీత నాగ (ఫణి) మృతి చెందాడు. ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. నల్లా సుభాష్‌ అనే యువకుడు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఫణి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

● అంబాజీపేట మండలం గంగలకుర్రులో గత ఏడాది ఏప్రిల్‌ 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగిపూడి నాగరాజు అనే వ్యక్తి ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన అతని సోదరుడు రామచంద్రరావును ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మృత్యువాత పడ్డారు.

● మండపేట పట్టణం ఏడిద బైపాస్‌ నాలుగు రోడ్ల జంక్షన్‌లో మే 9న టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో పట్టణానికి చెందిన అన్నదమ్ముల కుమారులు దార్ల దుర్గాప్రసాద్‌ (43), దార్ల శివకుమార్‌ (34)లు అక్కడికక్కడే మృతి చెందారు.

● కాకినాడ రూరల్‌ కొవ్వూరు బైపాస్‌ వద్ద గత నెల 16న టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఐదుగురు ఉపాధి కూలీలు మృతి చెందారు.

● కోరుకొండలో గత నెల 18న మట్టి లోడు టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో నొక్కి రాజీవర్మ (27) మృత్యువాత పడ్డాడు.

ప్రమాదాలు.. ఇవే కారణాలు

లారీ డ్రైవర్‌ రోజుకు 24 గంటల పాటు నిరాటంకంగా విధులు నిర్వహించాలి. రోజుకు రూ.వెయ్యి జీతం, అదనంగా రూ.ఐదు వందల బేటా. స్థానికంగా అయితే రోజుకు పది ట్రిప్పులు. దూరమైతే ఐదు ట్రిప్పులు వేస్తున్నారు. ఇసుక కొనుగోలు చేసేవారు ట్రిప్పునకు రూ.రెండు వందల వరకు అదనంగా ఇస్తున్నారు.

కొంతమంది డ్రైవర్లు బేటాలకు ఆశపడి అదనపు ట్రిప్పులే వేస్తే కొనుగోలుదారులు మరో రూ.రెండు వందలు, యజమానులు కూడా అదనంగా బేటా ఇస్తారనే అత్యాశతో మితిమీరిన వేగంతో లారీలు, టిప్పర్లు నడుపుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో అనుభవం ఉన్న డ్రైవర్లను పెద్ద నిర్మాణ సంస్థలు అధిక జీతాలతో నెలల తరబడి ఉద్యోగాలకు తీసుకుంటున్నారు. దీంతో డ్రైవర్ల కొరత ఏర్పడింది. ఇసుక, గ్రావెల్‌ వాహనాలు నడుపుతున్న వారిలో చిన్న వయసు వారే ఎక్కువ. వయసులో ఉండే అతి ఉత్సాహం, వేగ నియంత్రణ లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. సగం మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు కూడా లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

24 గంటల పాటు ఏకధాటిగా పని. పైగా ఈ సీజన్‌లో ఓవర్‌ టైమ్‌ కూడా చేస్తున్నారు. దీంతో నిద్ర ఉండడం లేదు. పైగా మ ద్యం, ఇతర వ్యసనాలతో వారు టిప్పర్లు, లారీలను నడపడంతో నియంత్రణ కోల్పోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement