ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌ జరిగింది. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.భాస్కర్‌రెడ్డి కలసి ప్రజల నుంచి మొత్తం 186 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌, మీ సేవా కేంద్రాలు, అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా కూడా తమ ఫిర్యాదులు, వినతులను నమోదు చేసుకోవచ్చన్నారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భూ సమస్యలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, వారసత్వం, సర్వే తదితర రెవెన్యూ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు.

చినవెంకన్న హుండీ

ఆదాయం రూ.1.70 కోట్లు

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రమోద కల్యాణ మండపంలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్‌వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గడచిన 14 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 1,70,53,076 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 147 గ్రాముల బంగారం, 2.510 కిలోల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని పాత రూ. 2 వేలు, రూ. 500 నోట్ల ద్వారా రూ.7,500 వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.

సత్యదేవునికి భారీగా

హుండీ ఆదాయం

అన్నవరం: పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 33 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ.1,96,59,883 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్‌, ఈఓలతో పాటు దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement