రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)– 2026 కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నాటికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయడంతో పాటు, స్వీకరించిన ఫారాలను సమాంతరంగా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. సోమవారం రాజమహేంద్రవరం మండలం హుకుంపేట, మోరంపూడి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్‌ఓల పనితీరు, ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగాన్ని పరిశీలించారు. సంబంధిత బీఎల్‌ఓలు మాట్లాడుతూ, తమ పరిధిలో 1,100 మందికి పైగా ఓటర్లు ఉన్నారని, అందులో సుమారు 60 శాతం మంది మ్యాపింగ్ పూర్తయ్యిందని తెలిపారు. కొంతమంది ఓటర్లు ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ఓటర్ల తల్లిదండ్రుల పేర్లు, గత నివాస వివరాలను ధ్రువీకరిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్ల వివరాల నిర్ధారణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ ప్రజలతో నేరుగా మాట్లాడి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి డీఆర్‌వో కె.భాస్కర్‌రెడ్డి, సహాయ ఈఆర్వో శ్రీనివాస్, ఎంపీడీఓ కె.సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
1న డీసెట్
రాజమహేంద్రవరం రూరల్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్) 2026ను జూలై ఒకటిన నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఆర్‌జేడీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీడీఈఈసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ లేదా సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ల నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.


