నాణ్యతను బట్టి ధర
వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.9 వేల నుంచి రూ.10 వేలు చెల్లిస్తున్నారు. కొబ్బరికి డిమాండ్ ఉండవలన మా పంట పండింది.
– కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు
గిట్టుబాటు ధర
గతంలో వ్యాపారస్తుల చుట్టూ తాము తిరిగేవాళ్లం. కానీ నేడు వ్యాపారస్తులు మా చుట్టూ తిరుగుతున్నారు. గత పదేళ్లలో ఇంత ధర చూడలేదు. దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తోంది.
– నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు
కొబ్బరికి డిమాండ్
ఇతర రాష్ట్రాల్లో సరుకు లేకపోవటంతో కొబ్బరికి మంచి డిమాండ్ ఉంది. ఈ ధరలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. అందుకే వచ్చిన కాయ వచ్చినట్లు మార్కెట్‌కు తరలిస్తున్నాం.
– అడబాల బ్రహ్మయ్య, వ్యాపారి, అన్నవరప్పాడు
పెరవలి:
కొబ్బరి కాయలకు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర లభించడంతో రైతులు, వ్యాపారస్తుల మోముల్లో ధరహాసం వెల్లివిరుస్తోంది. మార్కెట్‌లో నెల రోజుల క్రితం వెయ్యి కాయల ధర రూ.11 వేలు కాగా.. ప్రస్తుతం రూ.15 వేలు పలుకుతుంది. కాయల నాణ్యతను బట్టి రైతుల నుంచి కాయను రూ.9 నుంచి రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి కొబ్బరి కాయల ధర తగ్గడమే తప్ప పెరగలేదు. గత మూడు నెలల నుంచి కొబ్బరి కాయలకు డిమాండ్ లేకపోవడంతో బొండాలు తీయడంతో కొబ్బరి కాయలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతుల వద్దకే నేరుగా వ్యాపారస్తులు వచ్చి రూ.9 నుంచి రూ.10 ఇచ్చి కాయలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కొబ్బరికాయ ధర నాణ్యతను బట్టి రూ.14 వేల నుంచి రూ.15 వేలు పలుకుతున్నా రైతులకు మాత్రం దక్కేది కేవలం రూ.9 నుంచి రూ.10 అని అంటున్నారు. ఎందుకంటే దింపు తీయాలంటే దింపు కార్మికులకు, కాయలు పోగుచేసే కూలీలు, కాయల మోత కూలీలు, ఒలుపు, రవాణా వంటి ఖర్చులు పెరగడంతో రైతులకు మాత్రం దక్కేది ఇందులో సగమే. రైతులకు ఎటువంటి ఖర్చులు లేకుండా నేరుగా చేను వద్దకే వచ్చి కాయకు రూ.9 నుంచి రూ.10 చెల్లిస్తున్నారు. అదే రైతు దింపు తీసి ఒక్క చోట గుట్టగా పెడితే కాయ నాణ్యతను బట్టి రూ.14 వరకూ చెల్లిస్తున్నారు.
జిల్లాలో సాగెంత?
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో 70 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇదే కాకుండా చేలగట్లు, పుంత గట్లు, చెర్వు గట్లు, లంకభూముల్లోనూ కొబ్బరి సాగు చేస్తున్నారు. గతంలో ఎకరానికి 600 నుంచి 800 కాయలు పడితే.. నేడు తోటలు ఆరోగ్యంగా ఉండటం వల్ల 1200 నుంచి 1500 కాయల దిగుబడి వస్తుంది.
ధరలు పెరగడానికి కారణాలివే..
కొబ్బరికి మార్కెట్‌లో ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గత మూడు నెలల నుంచి కొబ్బరికి డిమాండ్ లేకపోవడంతో రైతులు కొబ్బరి బొండాలను తీసివేయడంతో కాయలకు కొరత ఏర్పడింది. దీంతో ధర ఈ నెల నుంచి క్రమేపీ పెరుగుతూ నేడు రూ.15 వేలకు చేరింది. కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు అనూహ్యంగా తగ్గిపోవడం కూడా మరో కారణం. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి.
పెరిగిన ఎగుమతులు
ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి నిత్యం 300 నుంచి 400 లారీల కాయ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా కొబ్బరి ధరను పెంచేది, తగ్గించేది ఈ రెండు జిల్లాలో ప్రధాన మార్కెట్లు అంబాజీపేట, పాలకొల్లు నుంచి నిత్యం 300 నుంచి 400 లారీల సరకు వెళుతోంది.
జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో
70 వేల హెక్టార్లలో పంట
వెయ్యి కాయలకు రూ.11 వేల నుంచి రూ.15 వేలకు ఎగబాకిన ధర
నిత్యం 300 నుంచి
400 లారీల ఎగుమతులు


