లక్కీ డ్రా పేరుతో ప్రజలకు టోకరా | - | Sakshi
Sakshi News home page

లక్కీ డ్రా పేరుతో ప్రజలకు టోకరా

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

రూ.6 కోట్ల వసూలు

నిర్వాహకుడి అనుమానాస్పద మృతి

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

దేవరపల్లి: లక్కీ డ్రా స్కీమ్‌ పేరుతో వందలాది మందికి టోకరా వేసిన నిర్వాహకుల ఉదంతం నల్లజర్ల మండలం పోతవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దాదాపు ఐదేళ్లుగా బల్లం రాజ్‌కుమార్‌, మరి కొంతమంది కలసి శ్రీశ్రీనివాస లక్ష్మి లక్కీ డ్రా స్కీమ్‌ నడుపుతున్నారు. నల్లజర్ల, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో సుమారు 1500 మంది నుంచి లక్కీ డ్రా పేరుతో సొమ్ములు కట్టించుకున్నారు. రూ.150, 300, 500, 1000 కార్డులను ఇచ్చి ప్రజల నుంచి వారం వారం, 15 రోజులకోసారి, నెల వారీగా సొమ్ము కట్టించుకున్నారు. డ్రాలో తగిలిన వ్యక్తులకు కొంత కాలం నిబంధనల మేరకు వస్తువులు ఇచ్చారు. ఈ విధంగా ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఒక్కో బాధితుడు సుమారు రూ.52 వేల నుంచి రూ.55 వేల వరకు కట్టారు. సుమారు 100 మందికి డబుల్‌ కాట్‌లు, 60 మందికి సింగిల్‌ కాట్‌లు, పరుపులు, 200 మందికి ల్యాప్‌టాప్‌లు ఇవ్వాల్సి ఉంది. బాధితుల నుంచి సుమారు రూ.6 కోట్లు వసూలు చేశారు. డ్రాలో తగిలిన లబ్ధిదారులకు సరకులు ఇవ్వకుండా నిర్వాహకుడు రాజ్‌కుమార్‌ కాలయాపన చేస్తూ కుంటిసాకులు చెబుతూ వస్తున్నాడు. ఇటీవల నిర్వాహకుడు రాజ్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు అతని ఇంటికి వెళ్లి తాము కట్టిన సొమ్ములు లేదా సరకులు ఇవ్వాలని అతడి కుటుంబ సభ్యులను కోరారు. దీనికి వారు సమాధానం చెప్పకపోగా, లక్కీ డ్రా గురించి తమకు తెలియదని, ఒత్తిడి చేస్తే కేసు పెడతామని బెదిరించినట్టు బాధితులు తెలిపారు. తాము మోసపోయామని గ్రహించిన పోతవరానికి చెందిన బాధితులు సోమవారం నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా సుమారు 1500 మంది మోసపోయినట్టు బాధితులు తెలిపారు. సుమారు రూ.6 కోట్లు నిర్వాహకులు వసూలు చేసి, మోసం చేసినట్టు లబ్ధిదారులు వివరించారు. నిర్వాహకుల్లో ఒకరు మృతి చెందినప్పటికీ మిగిలిన నిర్వాహకులు సొమ్ము చెల్లించడానికి ముఖం చాటేశారని బాధితులు వాపోతున్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement