● టికెట్ల స్కామ్ కేసులో ఇప్పటికే పూర్తయిన విచారణ
● నివేదిక సిద్ధంగా ఉన్నా చర్యలు శూన్యం
● అధికారులు వెనకాడుతున్నారంటూ ఆరోపణలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ ఏడాది మార్చి 15న వెలుగులోకి వచ్చిన రూ.200ల నకిలీ టికెట్ల స్కామ్ అప్పట్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. భక్తుల దర్శనం టికెట్ల వ్యవహారంలో చోటుచేసుకున్న ఈ అక్రమాలపై అప్పటి ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తు జరిపిన భీమడోలు సీఐ పి.కృష్ణ నలుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ఎన్‌ఎంఆర్ ఉద్యోగి, ఒక సెక్యూరిటీ సూపర్ వైజర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, తాడేపల్లిగూడేనికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మొత్తం 9 మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. వారంతా ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదిలా ఉంటే అప్పట్లో శాఖాపరమైన విచారణ (డిపార్ట్‌మెంటల్ ఎంక్వయిరీ) నిర్వహించిన దేవస్థానం ఈఈ డీవీ భాస్కర్ సంబంధిత నివేదికను ఈఓ భద్రాజీకి ఏప్రిల్ 6న సమర్పించారు. జాబ్‌చార్ట్ ప్రకారం సదరు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు.
చర్యలు శూన్యం
విచారణ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సంబంధిత ఉద్యోగులపై అధికారులు ఏ విధమైన శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. విచారణ నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ దానిపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తప్పుబడుతున్న భక్తులు
నకిలీ టికెట్ల విక్రయాల స్కామ్ దాదాపు ఏడాది పాటు సాగిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సంబంధిత అధికారులు, సిబ్బంది అలసత్వం, పర్యవేక్షణ లోపాలే ఈ స్కామ్ జరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలయ ఆదాయానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే స్థాయిలో జరిగిన ఈ వ్యవహారంలో బాధ్యులపై ఇప్పటి వరకు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని భక్తులు, స్థానికులు తప్పుబడుతున్నారు.
రెండూ వేర్వేరు..
డిపార్ట్‌మెంట్ ఎంక్వయిరీకి, పోలీసుల విచారణకు ఎలాంటి సంబంధం లేదని, శాఖాపరమైన విచారణ ఆధారంగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎవరి కోసం చర్యలు తీసుకోవడం లేదో అర్థంలేదని పలువురు అంటున్నారు. ఇదిలా ఉంటే టికెట్ల స్కాం కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌ను పోలీసులు ఇంకా కోర్టులో దాఖలు చేయలేదు.


