దిగబడిన ఊక లారీ
కాజులూరు: మూతికి మించిన ముద్ద.. వాహనానికి మించిన ఓవర్ లోడ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపై అధిక వేగంతో ఊక లారీలు యథేచ్ఛగా తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై వెళ్లే జనం ప్రాణాలతో చెలగాటంలా మారింది. భారీ భారం.. ఆపై ఊక కారణంగా ఇబ్బంది తెచ్చిపెడుతోంది. అయినా రవాణా శాఖ కళ్లప్పగించి చూస్తోంది.
కాజులూరు నియోజకవర్గంలోని కాకినాడ, కోటిపల్లి ప్రధాన రహదారిలో ఊక లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో ఇబ్బంది ఎదురవుతోంది. వాహనానికి ఇరుపక్కలా లోడు వేయడంతో రహదారిని మొత్తం ఆక్రమిస్తోంది. దీనివల్ల ఎదురుగా వచ్చే, పక్క నుంచి వెళ్లే వాహనాలకు దారి ఉండడం లేదు. గతంలో రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించే ఈ ఊక లారీలు, ట్రాక్టర్లు ఇటీవల పగలూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. కాజులూరు మండలంలోని దుగ్గుదుర్రు, జగన్నాథగిరి, ద్రాక్షారామ పరిసర గ్రామాల్లోని రైస్‌మిల్లుల నుంచి ఇటుక బట్టీలకు ఊక, బూడిద రవాణా జరుగుతోంది. లారీ, ట్రాక్టర్ వంటి వాహనాలకు ఇరువైపులా బరకాలు కట్టి ఊక, కాలిన బుడిద లోడు చేయడం వల్ల వాహనం సైజు భారీగా మారి, రోడ్డును ఆక్రమిస్తోంది. ఈ వాహనాలు వేగంగా వెళ్లే సమయాల్లో ఊక, బూడిద ఎగిరి వెనుక వచ్చే వాహనదారుల కళ్లలో పడుతుంది. ఇలా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ వాహనాలు రోడ్డుపై ప్రయాణించే సమయంలో పైన విద్యుత్ తీగలకు తగులుకుని మంటలు రావడం, లేకుంటే వాహనాలు మలుపులు తిరగలేక విద్యుత్ స్తంభాలను ఢీకొనడం తరచూ జరుగుతున్నాయి. గతంలో కాజులూరులో రోడ్డుపై వెళ్తున్న ఊక ట్రాక్టరుకు పైన విద్యుత్ తీగలు తగులుకుని మంటలు సంభవించగా, స్థానికులు గమనించి సకాలంలో ఆర్పివేశారు. ఇటీవల కోలంకలో యానం, ద్వారపూడి రహదారిపై ఊక ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, అది విరిగి ముక్కలై నేలపై పడింది. ఆ సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. అధికారుల కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆలమూరు: కొత్తూరు –వెదురుమూడి రోడ్డులోని పెదపళ్లలో ఆదివారం ఊక లారీ రోడ్డుపై దిగబడింది. అసలే ఇరుకు రోడ్డు కావడంతో పాటు భారీ వర్షం పడడంతో బెర్ములు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఐదు దశాబ్దాలుగా ఈ రోడ్డు విస్తరణ జరగకపోవడంతో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ వల్ల ఏదో ఒకచోట ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం లేదా ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైంది.
ఇబ్బంది పడుతున్నాం
ఊక, బూడిద లోడు చేసిన వాహనాలు రోడ్లపై వేగంగా వెళ్లే సమయాల్లో ఇబ్బందిగా ఉంటోంది. ఆ ఊక, బూడిద ఎగిరి వచ్చి వెనుక వచ్చే వాహనదారుల కళ్లలో పడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నాం.
– నల్లమిల్లి శ్రీవిష్ణురెడ్డి, ప్రయాణికుడు, మొగలిపాలెం
రోడ్డును ఆక్రమించేసి..
లారీ, ట్రాక్టర్ వంటి వాహనాలకు ఇరువైపులా బరకాలు కట్టి ఊక, కాలిన బుడిద లోడ్ చేస్తున్నారు. వాహనం సైజు భారీగా మారి రోడ్డు ఆక్రమిస్తుంది. ఇవి ముందు వెళ్తుంటే ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. వీటిని తప్పించుకుని వెళ్లే సమయంలో అనేక మంది ప్రమాదాల పాలయ్యారు.
– రాయుడు నూకరాజు, గొల్లపాలెం
వాహనాల సామర్థ్యానికి మించి లోడు
అధిక లోడుతో ఊక,
బూడిద లారీల పయనం
రోడ్లను ఆక్రమిస్తుండడంతో
ప్రయాణం నరకం


