పెరవలి (కొవ్వూరు): కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో మధ్యప్రదేశ్‌లో థార్ ప్రాంతానికి చెందిన దొంగల ముఠా సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టౌన్ సీఐ పి.విశ్వం తెలిపారు. దొంగలు చూస్తుండగానే మెడలో చైన్లు, బొందులు వంటివి లాక్కుని వెళ్లిపోతారని, తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడతారని వివరించారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దొంగల ఫొటోలను ఆయన విడుదల చేశారు.
పిడుగు పడి పాడి గేదెల మృతి
కాట్రేనికోన: పిడుగు పాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. కందికుప్పకు చెందిన కూరాకుల మల్లేశ్వరరావుకు రెండు గేదెలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయంతో అతను జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడంతో ఆ రెండు గేదెలు మృతి చెందాడు. దీంతో అతను కన్నీరు మున్నీరయ్యారు. అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని మల్లేశ్వరరావు కోరారు.
వేళంగిలో చైన్ స్నాచింగ్
కరప: ఉదయాన్నే తుడిచిన చెత్తను పారబోయడానికి బయటకెళ్లిన మహిళ మెడలోని పుస్తెల తాడును అపహరించుకుపోయిన ఘటన కరప మండలం వేళంగిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. వేళంగి శివారు దళమ్మచెరువు గట్టుకు చెందిన వాసంశెట్టి నాగవరలక్ష్మి ఆదివారం ఉదయం 5 గంటలకు ఇంట్లోని చెత్తను ఊడ్చి, రోడ్డుపక్క వేయడానికి వెళ్లింది. ఆ సమయంలో మోటార్‌సైకిల్‌పై అటుగా వెళుతున్న ముగ్గురు వ్యక్తులు నాగవరలక్ష్మి మెడలోని పుస్తెలతాడును తెంచుకుని, ఆమెను పక్కనే ఉన్న కంకర గుట్టపైకి తోసేసి పరారయ్యారు. పసుపుతాడుకు ఉన్న 8 గ్రాముల శతమానాలు చోరీకి గురైనట్టు బాధితురాలు కరప పోలీసులకు ఫోన్‌చేసి, సమాచారం అందించారు. కరప ఎస్‌ఐ టి.సునీత సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
కేసు వెనక్కి తీసుకోవాలని
భర్త బెదిరింపు
అమలాపురం టౌన్: తనపై పెట్టిన పోలీస్ కేసును వెనక్కి తీసుకోకపోతే చంపుతానని ఓ భర్త తన భార్యను బెదిరించిన ఘటనపై అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పట్టణ ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు కథనం ప్రకారం.. అల్లవరం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మట్టపర్తి సందీప్ ఉద్యోగి. గతంలో తన భార్య ఫిర్యాదుపై కోర్టులో ఇద్దరి మధ్య కేసు నడుస్తోంది. అప్పటి నుంచి భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. తన భార్య తల్లి (సందీప్ అత్త) మోటారు సైకిల్‌పై ఆదివారం వెళుతుండగా, ఆమెను సందీప్ ఫాలో అయ్యాడని ఎస్సై తెలిపారు. అమలాపురం నుంచి కొమరిగిరిపట్నం వెళ్లే మార్గంలో పేరూరు వై.జంక్షన్ వద్ద తన అత్త, భార్యను ఆపి సందీప్ బెదిరించాడన్నది అభియోగం. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై సందీప్‌పై కేసు నమోదు చేసి పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


