● రైలు బోగీ నుంచి దించిన దుండగులు
● సంచలనం రేపిన ఘటన
సామర్లకోట: రైలు బోగీలో యూరియా బస్తాల చోరీకి ప్రయత్నించిన సంఘటన ఇది. కాకినాడ నుంచి విశాఖపట్నంకు గూడ్స్ బోగీలో యూరియా బస్తాలు వెళుతున్నాయి. సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు వద్దకు వచ్చిన తరువాత బైపాస్ కేబిన్ వద్ద గూడ్స్ రైళ్లు విశాఖపట్నం వెళ్లడానికి సిగ్నల్ కోసం ఆగుతుంటాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం కాకినాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న గూడ్స్ రైలు ఉండూరు రైల్వే గేటు దాటిన తరువాత సిగ్నల్ కోసం ఆగింది. ఈ క్రమంలో కొంత మంది దుండగులు రైలు బోగీ తాళం పగలు కొట్టి బోగీలో ఉన్న యూరియా బస్తాలను పొలాల వైపు దింపారు. ఇంజిన్ నుంచి మూడో బోగీలో ఈ చోరీ జరగడంతో శబ్దంతో పాటు కొంత మంది మనుషులు సంచరిస్తున్న విషయాన్ని సిబ్బంది గమనించి వెంటనే రైల్వే మేనేజరు ఎం.రమేష్‌కు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని వెంటనే ఐఆర్‌ఎంకు తెలియజేశారు. దాంతో స్థానిక ఆర్‌పీఎఫ్ అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని యూరియా బస్తాలు బోగీ నుంచి పొలాల్లోకి దింపిన విషయాన్ని గమనించారు. రైల్వే అధికారులు వస్తున్న విషయాన్ని గుర్తించిన దుండగులు పరారయ్యారు. పొలాల్లో దింపిన సుమారు 60 యూరియా బస్తాలను ఆర్‌పీఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకుని ఆర్‌పీఎఫ్ సీఐ మధు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన యూరియా బస్తాలతో రైలు బోగీకి సీల్ వేసి గూడ్స్ రైలును పంపామని రైల్వే మేనేజర్ రమేష్ తెలిపారు.


