చింతూరు: రహదారి పక్కన ఆపిన కోళ్ల వ్యాన్ ఒక్కసారిగా కాలిపోయింది. ఈ సంఘటన చింతూరు కాటుకపల్లి వద్ద జాతీయ రహదారి–30పై ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చింతూరులోని కోళ్ల వ్యాపారి శ్రీనుకు చెందిన వ్యాన్ కోళ్లు తీసుకువచ్చే నిమిత్తం తెలంగాణలోని సత్తుపల్లికి బయలుదేరింది. ఈ క్రమంలో కాటుకపల్లి వద్ద వాటర్ బాటిల్ కొనేందుకు డ్రైవర్ వ్యాన్‌ను ఆపి పక్కనే ఉన్న షాపు వద్దకు వెళ్లగా, వ్యాన్ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. వ్యాన్ పూర్తిగా కాలిపోయింది.
దేవరపల్లిలో లారీ..
దేవరపల్లి: కడియం నుంచి రాజస్థాన్‌కు మొక్కలను తరలిస్తున్న లారీలో 16వ నంబరు జాతీయ రహదారిపై దేవరపల్లి వద్ద మంటలు రేగాయి. లారీ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దీనిని గమనించిన డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలుపుదల చేసి కిందకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. హైవే పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దేవరపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


