రాజానగరం: పోలీసులను చూసి భయపడి పారిపోతూ, ఇద్దరు పాత నేరస్తులు దొరికారు. దీనికి సంబంధించి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నార్త్‌జోన్ డీఎస్పీ జీవన విలేకరుల సమావేశం నిర్వహించారు. కొంతమూరుకు చెందిన పసల బేబి ఏప్రిల్ 13న సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి గండేపల్లి మండలం మురారికి ఆటోలో పయనమైంది. దివాన్‌చెరువులో అదే ఆటో ఎక్కిన ఇద్దరు మహిళలు ఆమెతో మాటామాటా కలిపి, బ్యాగులో ఉన్న రూ. 4.85 లక్షల విలువ చేసే బంగారు నగలు, వెండి వస్తువులను కాజేశారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు సీఐ వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం కొంతమూరులో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి, గోకవరం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న ఆటోలోని అంబటి జ్యోతి, నాగెళ్ల దుర్గ పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకుని తమదైన తరహాలో విచారించారు. పసల బేబి నుంచి బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించింది తామేనని వారు అంగీకరించారు. జ్యోతి, దుర్గ నుంచి 176.470 గ్రాముల బంగారు నగలు, 197.300 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను లూటీ చేయడంలో ఆరి తేరిన ఈ మహిళలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు పాత నేరస్తుల అరెస్ట్


