ఫ యోగాపై ప్రచారానికే ప్రభుత్వం పెద్దపీట
ఫ కేంద్రాన్ని ప్రసన్నం
చేసుకునేందుకు రూ.కోట్ల ఖర్చు
ఫ ఆనక ఆ ఊసెత్తని వైనం
ఫ నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
కపిలేశ్వరపురం: గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాటి ఎవరూ రారు. యోగాంధ్ర 2025 పేరుతో గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు సుమారు రూ.350 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. రాష్ట్రంలో 3,03,654 మందితో విశాఖ తీరాన యోగాసనాలు వేయించి గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండో గిన్నిస్ రికార్డు దక్కింది. 61,266 పాఠశాలల్లో యోగాంధ్ర నిర్వహించినట్టు సమగ్ర శిక్షా ఏఎస్పీడీ శ్రీనివాసరావు గతేడాది ప్రకటించారు. అప్పుడు మాత్రమే చెప్పిన ఈ లెక్కలు అంతకు ముందూ లేవు, ఇప్పుడూ లేవు. యోగా కేవలం ప్రచార ఆయుధం మాత్రమే అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పురాతన కాలం నుంచీ యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. దాని ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడమే జీవిత లక్ష్యంగా అనేక సంస్థలు, వ్యక్తులు ఎలాంటి ప్రచారాన్ని కోరుకోకుండా యోగా కోసం పాటుపడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నం యోగా డే నెలలో మాత్రమే ఆర్భాటం చేస్తుంది. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు గతేడాది విశాఖలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించిందన్న వాదన ఉంది. జిల్లాలో సుమారు రూ.కోటి పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. సకల సమస్యలకు యోగానే మందు అనే రీతిలో చంద్రబాబు ఉపన్యాసాల్లో చెప్పారు. జిల్లాలో 8,72,916 మంది యోగా చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు, వారికి యోగా శిక్షకులను కేటాయిస్తూ మ్యాపింగ్ చేసినట్టు, 4,600 ప్రాంతాల్లో యోగా శిబిరాలను నిర్వహించినట్టు గతేడాది ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది. రాజమహేంద్రవరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో 2 కిలోమీటర్ల మేర ప్రాంతంలో యోగాసనాలు చేయించింది. పాలన, ఇతర ప్రజావసరాలను పక్కన పెట్టి నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని యోగా చేసుకునేందుకు అంగీకరిస్తున్నానంటూ ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. మీ విజ్ఞప్తి మేరకు పలానా చోట యోగా చేసేందుకు అనుమతిస్తున్నామంటూ ప్రజలకు మెస్సేజ్ రావడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. విశాఖకు జనాన్ని తరలించేందుకు జిల్లాలోని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దూరాన ఉన్న విశాఖకు వెళ్లేందుకు అర్ధరాత్రి 12 గంటలకే బస్సుల్లోకి ఎక్కించారు. కార్యక్రమం పూర్తయ్యాక అందిస్తామన్న ఆహార ప్యాకెట్లు అందక ఆకలితో అలమటించిన వారెందరో ఉన్నారు. ఆ రోజు గడిచాక నేటి వరకూ యోగాపై తీసుకున్న చర్యలేవీ లేవు.
ఈ ఏడాది జిల్లాలో కార్యక్రమాలు ఇలా..
జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ, ఆయుష్ సంస్థ, పర్యాటక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర–2026ను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 8న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాభ్యాసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, పలు ప్రభుత్వ శాఖల, నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 11న కడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, జేసీ మేఘ స్వరూప్ పాల్గొన్నారు. 14న రాజమహేంద్రవరం గౌతమీ ఘాట్ ప్రయాణ ప్రదేశంలో జిల్లా స్థాయి సామూహిక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
యోగా.. వ్యాధులను తరిమికొట్టే దివ్యౌషధం.. నిశ్చలమైన మనసుతో నిండుగా జీవించేందుకు ఓ ఆయుధం.. మన ‘యోగ’క్షేమాలకు ఇదో శక్తివంతమైన పురాతన చికిత్సా విధానం.. అలాంటి యోగాను సైతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆయుధంగా మార్చుకుంది.. యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ చెప్పుకొంటూ రూ.కోట్లు ఖర్చు చేసి, ప్రచార హంగామా చేస్తోంది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
ప్రాధాన్యం ఇదీ..
ఆధునిక కాలంలో తలెత్తుతున్న రుగ్మతల నేపథ్యంలో ధ్యానం, యోగా వంటి ప్రాచీన విధానాలకు ప్రాధాన్యం పెరిగింది. యోగా అనేది సంస్కృతంలోని ‘యుజ్’ అనే పదం నుంచి వచ్చింది. ‘యుజ్’ అనే పదానికి ఐక్యం కావడమని అర్థం. మనసు, శరీరమూ ఒకదానితో మరొకటి ప్రభావితమై ఉంటాయి. ఆ రెండింటినీ ఏకం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. యోగాలోని 84 ఆసనాల్లో 32 అతి ముఖ్యమైనవి. క్రమం తప్పకుండా యోగాసనాలను వేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆలోచనలను నియంత్రించుకోగలుగుతారు. సూర్య నమస్కారాల్లోని పదకొండు ఆసనాల్లో ఆరోగ్య, ఆధ్యాత్మిక అంశాలు ఒదిగి ఉంటాయి. వాటిని చేయడం ద్వారా కదలికలు ఏర్పడి శరీర అవయవాల్లోని భాగాలకు రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది.


