ఫ రూ.ఐదు లక్షలు
ఉన్నాయని తెలుసుకుని హత్య
ఫ ఆక్వా రైతు హత్య కేసులో
కూలీలే నిందితులు
ఫ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
ఐ.పోలవరం: ఫోన్ పే కొంపముంచింది.. బ్యాంక్ అకౌంట్‌లో రూ. 5 లక్షలు ఉన్నాయని తెలుసుకుని ఓ ఆక్వా రైతును కూలీలే హత్య చేయడం చర్చనీయాంశమైంది. ఐ.పోలవరం మండలం మురమళ్ల ఆక్వా చెరువు వద్ద రైతు దాట్ల కృష్ణంరాజు (64) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శనివారం పాత ఇంజరం పోలీస్ స్టేషన్ వద్ద అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ మోహన్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఈ నెల 17న మురమళ్లకు చెందిన దాట్ల కృష్ణంరాజు తన ఆక్వా చెరువు వద్ద హత్యకు గురయ్యారు. చెరువు వద్ద పనిచేసే ఇద్దరు కూలీలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు విశాఖ జిల్లా కొయ్యూరు గ్రామానికి చెందిన సలాపరెడ్డి బాబ్జీ కాగా, మరొకరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బాలుడు. వారం రోజుల క్రితం వీరిద్దరూ కృష్ణంరాజు చెరువు వద్ద పనికి కుదిరారు. పని చేయకపోతే రైతు కృష్ణంరాజు ఊరుకునేవారు కాదని, ఇక్కడ పని చేయలేమని నిర్ధారించుకుని వారు మానేయాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల కూలీ డబ్బులు ఇచ్చేయండి, మేం వెళ్లిపోతామని కృష్ణంరాజుతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో 14న బాబ్జీ భార్య సెల్‌ఫోన్‌కు రూ.వెయ్యి ఫోన్‌పే చేయించుకున్నారు. అప్పుడే యజమాని కృష్ణంరాజు ఫోన్‌పేలో రూ.5 లక్షలు ఉన్నట్లు నిందితులు గుర్తించారు. 17న మధ్యాహ్నం కృష్ణంరాజు చెరువు వద్ద కుర్చీలో కూర్చుని ఫోన్ చూస్తుండగా, నిందితులు ఏరియేటర్ రాడ్డుతో ఆయన తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహం కాళ్లకు నైలాన్ తాడు చుట్టి, ఆ తాడుకు నాలుగు ఫెన్సింగ్ రాళ్లు కట్టి ఎవరికీ కనిపించకుండా చెరువులో పడేశారు. మృతుడు కుర్చీని, షెడ్డు వెనుక మురికి కాలువలో పడేశారు. మోటార్ సైకిల్‌ను ఎవరికీ కనిపించకుండా రేకుల షెడ్డు పక్కన బాత్రూమ్ గోడకు ఆనుకుని ఉంచి, రాడ్‌ను సెప్టిక్ ట్యాంక్‌పై ఉన్న నల్లని బరకల్లో దాచిపెట్టారు. సాయంత్రం 4 గంటల సమయంలో మృతుడి ఫోన్, హత్య సమయంలో రక్తపు మరకలు అంటిన తమ దుస్తులు తీసుకుని నిందితులు కాకినాడకు వెళ్లిపోయారు. నిందితులను పట్టుకున్న పోలీసులు మృతుడి ఫోన్ స్వాధీనం చేసుకుని, ఫోన్‌పే ద్వారా రూ.90 వేలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ మోహన్ కుమార్, ఎస్సై రవీంద్రబాబును డీఎస్పీ అభినందించారు.


