కాలు తెగిపోయి రక్తస్రావమై మృతి
అనపర్తి: రోజూ రైళ్లలో సమోసాలు విక్రయించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ చిరు వ్యాపారి జీవితం విషాదాంతమైంది. అనపర్తి రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో అతను మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. స్థానికులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. చిరు వ్యాపారి సత్యబాబు (55) రైళ్లలో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం రోజూ రైలు బోగీల్లో తిరుగుతూ ప్రయాణికులకు సమోసాలు విక్రయించేవాడు. అదే జీవన పోరాటం చివరకు అతని ప్రాణాలను బలిగొంది. శనివారం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు అనపర్తి స్టేషన్‌లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో సత్యబాబు రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ జారి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. ప్రమాదంలో అతని కుడి కాలు తెగిపోగా తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన సత్యబాబును చూసి ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ దుర్గాభవానీ, పైలెట్ ఆనందరావులు హుటాహుటిన అతికష్టంపై సత్యబాబును ప్లాట్‌ఫారమ్‌పైకి చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా సత్యబాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


