● కారుమూరి సునీల్‌పై
అక్రమ కేసులు దారుణం
● కూటమి నేతలే లిక్కర్ డాన్‌లు
● డైవర్షన్ పాలిటిక్స్‌కు
తెరలేపుతున్న ప్రభుత్వం
● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజం
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపులే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం వైఎస్సార్ సీపీ నేతలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బ తీసేలా ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీని పారదర్శకంగా అమలు చేశామన్నారు. అలాంటి పాలసీలో అవకతవకలంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై చంద్రబాబు సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు టెండర్ వేసే వాళ్లను బెదిరించి, భయపెట్టి మద్యం షాపులను చేజిక్కించుకున్నారని చెప్పారు. టీడీపీ, జనసేనతో పాటు మంత్రి లోకేష్ గల్లాపెట్టెకి వాటాలు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. 2014–19 మధ్య మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.16,912 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 2023–24 వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న చివరి ఏడాదికి మద్యం ఆదాయం రూ.24,760 కోట్లకు పెరిగిందన్నారు. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే రూ.8 వేల కోట్ల ఆదాయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో పెరిగిందని గుర్తు చేశారు. కేవలం వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఆరోపించడం తగదని మండిపడ్డారు. ఎంపీ మిధున్‌రెడ్డి నుంచి కారుమూరి సునీల్ వరకూ లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారని అన్నారు. బీసీ వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారనే దుగ్ధతో కేసులతో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ ఆధారాలతో దొరికిపోతే కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. పోలీసు వ్యవస్థలో సీఐడీ, ఏసీబీని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఆరోపించారు.
చిన్నారి మిస్సింగ్ కేసులో పురోగతి ఏదీ?
తునిలో చిన్నారి మిస్సింగ్ కేసులో నేటికీ పురోగతి లేదని రాజా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు. పోలీసు వ్యవస్థ వీటిపై దృష్టి సారించకుండా కేవలం పోలీస్ స్టేషన్లను టీడీపీ కార్యాలయాలుగా మార్చి, వారికి అనుకూలంగా పని చేస్తోందని విమర్శించారు. పోలీసులు ఎంతకు బరితెగించారంటే.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని మర్డర్ చేయడానికి కూడా వెనుకాడటం లేదని దుయ్యబట్టారు. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. యువనేత కారుమూరి సునీల్‌కు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తుందని రాజా స్పష్టం చేశారు.


