కన్న తండ్రికి కన్నీటి వీడ్కోలు అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు | - | Sakshi
Sakshi News home page

కన్న తండ్రికి కన్నీటి వీడ్కోలు అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

అయినవిల్లి: కని, పెంచి, పెద్ద చేసి.. అనారోగ్యంతో మంచం పట్టి.. తనువు చాలించిన తండ్రికి కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికిన సంఘటన అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ (52)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్న ఉన్నారు. క్యాటరింగ్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సత్యనారాయణ భార్య సరస్వతి మానసిక దివ్యాంగురాలు. ఏడాది క్రితం సత్యనారాయణకు పక్షవాతం రావడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, కుటుంబ భారం పెద్ద కుమార్తె ప్రసన్నపై పడింది. ఆమె ముమ్మిడివరంలోని ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో పని చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తోంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు జ్యోతిక, జ్యోత్స్న కవలలు. వీరు అదే గ్రామంలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో సత్యనారాయణ శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. సత్యనారాయణకు అక్క, తమ్ముడు ఉన్నారు. వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతూండటంతో మృతి చెందిన సోదరుడి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తండ్రి సత్యనారాయణ మృతదేహానికి కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు అంత్యక్రియలు నిర్వహించారు. వారి పరిస్థితిని చూసి, చలించిన గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. తల్లికి మతిస్థిమితం లేకపోవడం, తండ్రి మృతి చెందడంతో.. ఆ అక్కాచెల్లెళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement