సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై విచారణ జరపాలి

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలి

మాజీ హోం మంత్రి

తానేటి వనిత డిమాండ్‌

దేవరపల్లి: విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన గిగ్‌ వర్కర్‌ సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధ్యులందరిపై హత్య కేసు నమోదు చేయాలని మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తానేటి వనిత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రక్షణ కల్పించాల్సిన రక్షణ భటులు ప్రజల పాలిట భక్షక భటులుగా మారి, ప్రాణాలు తీసేస్తూ, కనీసం వారి శవాలను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. సాయికృష్ణ, క్రాంతికుమార్‌ మరణాలకు కారణమైన వారిపై విచారణ చేపట్టాలని, వారి వెనుక ఉన్న వారెవ్వరో బయటకు రావాలని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఈ రెండు సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

హోంమంత్రి అనిత తీరు దారుణం

కాకినాడ జిల్లా తునిలో బాలిక అదృశ్యమైన ఘటనపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు హోం మంత్రి అనిత నవ్వుతూ సమాధానం చెప్పడమేమిటని వనిత ప్రశ్నించారు. సాయికృష్ణ నేరస్తుడే కావచ్చునని, అతడిని శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు. సాయికృష్ణపై సీఐ నాగరాజు థర్డ్‌ డిగ్రీ ఎందుకు ప్రయోగించాడని ప్రశ్నించారు. సాయికృష్ణ జనసేన కార్యకర్తని, కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తకే ఇలాంటి పరిస్థితి ఉంటే, సామాన్యుల పరిస్థితేమిటని వనిత ప్రశ్నించారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించేంత వరకూ ప్రభుత్వం, పోలీసులు ఆ తల్లి గోడును పట్టించుకోలేదని అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు వ్యవస్థ పని తీరు చాలా బాగుందని హోం మంత్రి అనిత గొప్పలు చెప్పుకోవడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. ప్రజలను ఏం ఉద్ధరించారని రెండేళ్ల పరిపాలనకు విజయోత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement