రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేసిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో సంహిత కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయన్నారు. సునీల్ కుమార్ అక్రమ అరెస్టు దారుణమని, ఇది ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అత్యంత పారదర్శకంగా జరిగాయన్నారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం కోసమే మద్యం దుకాణాలు తగ్గించి, ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించిందన్నారు. పర్మిట్ రూములను, బెల్ట్ షాపులను రద్దు చేసిందన్నారు. అయినప్పటికీ మద్యం కేసు సృష్టించి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీ వర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వాస్తవానికి 2014–19 మధ్య రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు మద్యం సరఫరా విక్రయాల్లో ఎన్నో అక్రమాలు చేశారన్నారు. బార్లకు మేలు చేకూర్చే విధంగా ప్రివిలేజ్ ఫీజును రద్దుచేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారన్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ల చేతుల్లో ఉంచుకుని పర్మిట్ రూములు ఊరూరా, బెల్ట్ షాప్‌లు వాడవాడలా నిర్వహించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించి జనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై చంద్రబాబుపై కేసు కూడా నమోదయిందన్నారు. అధికారంలోకి రాగానే ఆ కేసును మాఫీ చేసుకోవడంతో పాటు జనం దృష్టిని మరలించడం కోసం లేని కేసును సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్నారన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు.
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం
జిల్లా అధ్యక్షుడు దుర్గారావు


