కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంఎస్.రాజు ఆదేశాల మేరకు కళాశాలలో చదువుతున్న రెండవ, మూడవ సంవత్సరం వైద్య విద్యార్థులకు ఆ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వాల్‌పోస్టర్ ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ ఈ ఏడాది నినాదంలో ఈక్విటీ అనే అంశం అత్యంత ప్రాధాన్యమైనదని, ప్రతి వ్యక్తికి వారి అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించడమే ఆరోగ్య సమానత్వం ప్రధాన లక్ష్యమన్నారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన వైద్యం, కౌన్సెలింగ్ అందించవచ్చన్నారు. ఇది వారసత్వంగా సంక్రమించే జన్యుపరమైన వ్యాధి కావడంతో వివాహానికి ముందు స్క్రీనింగ్ నిర్వహించడం అవసరమని, జన్యు సలహాలు అందించడం ఎంతో ముఖ్యమన్నారు. జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్‌లతో పాటు పాథాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.


