కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు
సామర్లకోట: పిఠాపురం నుంచి అచ్చంపేట ఏడీబీ రోడ్డు మీదుగా సామర్లకోట వైపు వస్తున్న లోడ్ లారీ శుక్రవారం ఉండూరు రైల్వే గేటు వద్ద రైల్వే గడ్డర్‌లో ఇరుక్కుపోయింది. దాంతో ఉండూరు రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిఠాపురం నుంచి మండపేట వెళ్లాల్సిన లోడ్ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ద్వారా వస్తున్నారు. దీనివల్ల అచ్చంపేట ఏడీబీ రోడ్డు నుంచి ఉండూరు మీదుగా రావడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీలో లోడ్ ఎత్తుగా ఉండటంతో ఉండూరు ఫిల్టర్ బెడ్ వైపు ఉన్న రైల్వే గడ్డర్ దాటి, రైల్వే పట్టాల తరువాత రెండో వైపు గడ్డర్‌లో చిక్కుకుంది. దాంతో రైల్వే గడ్డర్ కూలిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో లారీపై ఇరుకున్న గడ్డర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రైల్వే పోలీసులు లారీ డ్రైవర్ నుంచి రికార్డులను స్వాఽధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
హత్య కేసులో
నిందితుడికి జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విఽధిస్తూ నాల్గవ అదనపు జిల్లా న్యాయస్థానం, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి జి.షణ్ముఖరావు శుక్రవారం తీర్పునిచ్చారు. దీనికి సంబంఽధించిన వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డుకు సమీపంలోని శ్రీనివాసనగర్‌లో చప్పిడి సునీల్‌కుమార్ (37) నివాసం ఉంటున్నారు. అతన్ని రాజవోలుకు చెందిన డెన్వర్ విలియమ్స్, అతని భార్య మేరీ విలియమ్స్ కలసి హత్య చేశారు. దీనిపై అప్పటి సీఐ ఆర్‌జే రవికుమార్ కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఎస్‌కే బాజీలాల్, కోర్టు కానిస్టేబుల్ పీవీవీఎస్‌డీ రమేష్ కేసు విచారణ సమయంలో సాక్ష్యాలను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఏపీపీ కె.కనకలింగేశ్వరరావు వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో రెండో నిందితురాలు మేరీ విలియమ్స్ 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
యువతి ఆత్మహత్య
రాజమహేంద్రవరం రూరల్: ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరం ఆవ వాంబే కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఆవ వాంబే కాలనీకి చెందిన ముత్యాల భువనేశ్వరి (32) ఆరు నెలలుగా ఓ ప్రైవేటు సంస్థలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తుంది. గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో భువనేశ్వరి వంట గదిలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భువనేశ్వరి తరచూ వంశీ అనే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండేదని, పొరుగింట్లో ఉన్న లక్ష్మి అనే మహిళ భువనేశ్వరి పెద్దన్నయ్యకు గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను ఇంటికి వచ్చి చూడగా, వంట గదిలో భువనేశ్వరి ఉరివేసుకుని మృతి చెంది ఉంది. ఆమె తండ్రి ముత్యాల వీర్రాజు ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వరికి వంశీతో ఉన్న ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


