గోప్యంగా ఉంచిన విచారణ అధికారులు
తుని రూరల్: మండలంలోని దొండవాక పంచాయతీ శివారు సీహెచ్ అగ్రహారంలోని ఆయిల్‌పామ్ తోటలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క అదేరోజు అదృశ్యమైందని అంతా భావించారు. అయితే ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అక్కడి వినాయకుడి గుడి వద్ద కుక్క సంచరించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క అదృశ్యమైన విషయం తెలిసిందే. చిన్నారితో పాటు అదృశ్యమైన ఆ కుక్క ఒంటరిగా మూడు రోజుల తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటికి చేరింది. ఇలా చేరుకున్న కుక్క చిన్నారి తల్లి వద్దకు వెళ్లి చీరను నోటితో పట్టుకుంది. చిన్నారి జాడ చూపిస్తుందేమోనన్న ఆత్రుతలో కుక్క వద్దకు గాలింపు బృందాలు చేరుకున్నాయి. దీంతో ఆందోళన చెందిన కుక్క పరారైంది. అలా వెళ్లిన కుక్క అర్ధరాత్రి ఇంటికి చేరడంతో గాలింపు బృంద సభ్యులు వలలతో పట్టుకుని కట్టేశారు. మరుసటి రోజు సాయంత్రం కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి, చిన్నారి జాడ తెలుసుకునేందుకు గాలింపు బృందాలు ప్రయత్నించాయి. జీపీఎస్ అమర్చిన తర్వాత ఎనిమిది కిలోమీటర్లు సంచరించిన కుక్క ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో నిరసించిపోవడంతో ఇనుప కోళ్లగూడులో ఉంచారు. మరుసటి రోజు ఉదయం ఆరుస్తూ అది చనిపోయింది. చనిపోయిన కుక్క కళేబరాన్ని ఎన్.సూరవరం వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కుక్క మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఏ కారణంతో చనిపోయిందో నిర్ధారించేందుకు కుక్క అవయవాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఒకటి రెండు రోజుల్లో నివేదిక రానున్న సమయంలో చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం ఆ గ్రామంలో వినాయకుడి గుడి వద్ద కుక్క సంచరించినట్టు ప్రచారం జరిగింది. చిన్నారి అదృశ్యమైన సంఘటనలో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క సంచారాన్ని గోప్యంగా ఉంచడం, కొందరికే సమాచారం ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6న మధ్యాహ్నం గుడి వద్ద సంచరించిన కుక్క, జ్ఞానేశ్వరితో అదృశ్యమైన కుక్క ఒక్కటేనని ఎస్‌ఐ కృష్ణమాచారి శుక్రవారం తెలిపారు. మూడో రోజు కుక్క ఇంటికి రావడంతో సీసీ ఫుటేజ్‌లో గుర్తించిన విషయాన్ని దర్యాప్తులో భాగంగా వెల్లడించలేదన్నారు. అదృశ్యమైన జ్ఞానేశ్వరి వెంట పెంపుడు కుక్క వెళ్లలేదా, వెళ్తే చిన్నారిని రక్షించేందుకు వెళ్లొస్తూ అటువైపుగాా కనిపించిందా అనే సందిగ్ధత నెలకొంది. ఈ ఆధారమే చిన్నారి ఆచూకీ బయట పెడుతుందనే చర్చ జరుగుతోంది.


