చోరీ కేసులో పని మనిషే నిందితురాలు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో పని మనిషే నిందితురాలు

Jun 20 2026 12:19 AM | Updated on Jun 20 2026 12:19 AM

ఉప్పలగుప్తం: చోరీ కేసులో పని మనిషే నిందితురాలిగా తమ విచారణలో తేలిందని డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఎస్‌.యానాం గ్రామానికి చెందిన చెలుకూరి రాంబాబు భార్య అనంతలక్ష్మి వైద్యం నిమిత్తం 2022 నుంచి విశాఖపట్నం జిల్లా మధురవాడలో ఉండేవారు. అనంతలక్ష్మికి సహాయకురాలిగా విజయనగరం జిల్లా గట్యాడ మండలం, బుడతనపల్లి గ్రామానికి చెందిన బోనంగి శాంతిని పనిలో పెట్టుకున్నారు. ఇటీవల రాంబాబు, అనంతలక్ష్మి దంపతులు మధురవాడలో ఇల్లు ఖాళీ చేసి స్వగ్రామం ఎస్‌.యానాం వచ్చేశారు. అయితే ఇంట్లో పనిచేస్తున్న శాంతిని కూడా వెంట తీసుకొచ్చి మూడు రోజులున్న తర్వాత ఆమెను ఊరికి పంపించారు. ఆమె వెళ్లిన తర్వాత ఇంట్లో బీరువా తాళాలు కనబడకపోవడంతో పగులు గొట్టి తెరిచారు. అందులో 18 కాసుల బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో గత నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసి, పనిమనిషే నిందితురాలు అని తేల్చారు. దీనిపై శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్లో డీఎస్పీ ప్రసాద్‌, సీఐ డి.ప్రశాంత్‌ కుమార్‌, ఎస్‌ఐ జానీ బాషాలు వివరాలు వెల్లడించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. యజమాని రాంబాబుకు ఆభరణాలను అందజేశారు. కేసును ఛేదించిన సిబ్బంది, హెచ్‌సీలు బీవీ గిరి, హరినాథ్‌, కానిస్టేబుళ్లు నాగరాజు, కరీంచంద్‌, ఆర్‌.కనకదుర్గలను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.

బ్లేడ్‌తో దాడి చేసిన

వ్యక్తికి రిమాండ్‌

సీతానగరం: దాడి కేసులో ఓ వ్యక్తికి కోర్టు రిమాండ్‌ విధించింది. ఎస్సై ఎల్‌.శ్రీనునాయక్‌ కథనం ప్రకారం.. రాజానగరం మండలం రఘునాథపురానికి చెందిన మట్ట చిన్నారావు తన మేనత్త కుమారుడి వివాహ వేడుకకు ఏప్రిల్‌ 26న బొబ్బిల్లంక వచ్చాడు. తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకు బొబ్బిల్లంకలోని రామాలయం వద్ద కూర్చుని ఉండగా.. బత్తిన దుర్గాప్రసాద్‌, మట్ట శివకృష్ణ, లంజపల్లి సుధీర్‌లు మోటారు సైకిల్‌పై వచ్చి చిన్నారావు వీపుపై పోల్డింగ్‌ బ్లేడ్‌తో గాయపరిచారు. బాధితుడు సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కవలగొయ్యి గ్రామంలో నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారని ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement