ఆచూకీ కోసం నదిలో గాలింపు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి దూకి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ వివరాల ప్రకారం.. రాజానగరం మండలం దివాన్‌చెరువు శ్రీరామపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ కాకినాడలోని ఏపీఎస్‌పీ మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అదే శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహిళతో పరిచయం ఏర్పడింది. దీనిపై ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారు. వివాహం కుదుర్చేందుకు అమ్మాయి ఇంటికి వెళ్లారు. ఆ అమ్మాయి బాగోలేదని వంశీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదిలాఉండగా అతనికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీనిపై వంశీకి ఆ మహిళా కానిస్టేబుల్ ఫోన్ చేసి నిలదీసింది. దీనికి అతను ముఖం చాటేస్తుండడంతో రాజమహేంద్రవరం దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వంశీని పోలీస్ స్టేషన్‌కు పిలిచి అక్కడ పోలీసులు మాట్లాడారు. ఇదిలా ఉండగా రెండు రోజుల నుంచి వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీంతో వంశీ శుక్రవారం తెల్లవారు జామున తన తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి, తాను రైల్వే బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి, ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఈ విషయాన్ని వెంటనే ఆయన పోలీసులకు తెలిపాడు. వారు అక్కడకు వెళ్లి చూడగా, రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నాలుగో ఫిల్లర్ వద్ద వంశీ మోటారు సైకిల్, చెప్పులు లభించాయి. సెల్‌ఫోన్ కనిపించలేదు. అక్కడ గోదావరి నదిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. వంశీ నిజంగా గోదావరిలో దూకాడా లేదా అనేది తెలియడం లేదు. దీంతో రెండో పట్టణ పోలీసులు వంశీది అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


