● వచ్చే ఏడాదే గోదావరి పుష్కరాలు
● జిల్లాలో వివిధ పనులకు
రూ.2 వేల కోట్లతో అంచనాలు
● ఏడాది కిందటే ప్రతిపాదనలు
పంపిన అధికారులు
● నేటికీ నయాపైసా ఇవ్వని ప్రభుత్వం
● మంజూరుపై స్పష్టత కరువు
సాక్షి, రాజమహేంద్రవరం: అంతన్నారింతన్నారే.. అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పని తీరు. గోదావరి పుష్కరాలకు సరిగ్గా ఏడాది కాలం ఉంది. అలా చేసేస్తాం.. ఇలా చేసేస్తాం.. పుష్కరాలను కుంభమేళాలా నిర్వహించేస్తాం.. అని ప్రభుత్వ పెద్దలు తరచుగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు నెలలో రెండుమూడుసార్లు సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఘాట్లను పరిశీలించడం, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం మంత్రి, ఎమ్మెల్యేలకు నిత్యకృత్యమవుతోంది. పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించేస్తామని అంటున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలు మాత్రం క్షేత్ర స్థాయిలో గడప దాటడం లేదు. పుష్కర నిధుల కోసం ప్రతిపాదనలు పంపించి ఏడాది దాటుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం నయాపైసా కూడా విదల్చలేదు. దీంతో, నిధులు విడుదల చేయకుండా పనులు ఎలా చేపట్టగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఆరు జిల్లాలు.. రూ.8 వేల కోట్లు..
వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాల్లో పుష్కరాల పనులు చేపట్టేందుకు అధికారులు రూ.8 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. తూర్పు గోదావరి జిల్లాలో 102, పశ్చిమ గోదావరి జిల్లాలో 40, కోనసీమలో 175, కాకినాడలో 6, ఏలూరు జిల్లాలో 36 చొప్పున ఘాట్లు అభివృద్ధి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. వీటితో పాటు వివిధ అభివృద్ధి పనులకు రూ.8 వేల కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏడాది దాటుతున్నా ఈ ప్రతిపాదనలకు నేటికీ అతీగతి లేదు. వీటిని ఆమోదించారా.. తిరస్కరించారా.. అసలు నిధులు విడుదల చేస్తారా.. లేదా.. అనే విషయంపై స్పష్టత కరువైంది.
నిధుల ప్రవాహమేదీ!
జిల్లావ్యాప్తంగా పుష్కరాల పనులకు తొలి దశలో రూ.1,578 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వాటిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో వివిధ పనులు చేపట్టేందుకు రూ.2,105.96 కోట్లతో ఏడాది క్రితం రెండోసారి ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం నయాపైసా కూడా విడుదల చేయలేదు. పైగా పుష్కరాలకు సంబంధించి ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా చేపట్టాల్సిన పనుల జాబితాను ఆయనకు అధికారులు అందించారు. ఆ సందర్భంగా నిధులు త్వరలోనే విడుదల చేస్తామని మాత్రం చెప్పారు. సమీక్ష జరిగి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినా..
పుష్కరాల పనులు, గోదావరి కాలుష్యం పరిశీలనకు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై, గోదావరి పుష్కరాల పనులపై చర్చించారు. పనులు అలా చేయాలి.. ఇలా చేయాలని అంటూ అధికారులకు సూచనలు చేశారు. నిధులు విడుదల కాకుండా పనులు ఎలా చేస్తారని అక్కడే ఉన్న ఓ బీజేపీ నేత, మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వచ్చే వరకూ చూడకుండా శాఖల వారీగా నిధులు వెచ్చించాలంటూ పవన్ ఓ ఉచిత సలహా ఇచ్చి మిన్నకుండిపోయారని అంటున్నారు. దీనినిబట్టి చూస్తే.. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందా, లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
కేంద్రం పైనే ఆశలు?
పుష్కరాలకు నిధులు విడుదల చేయకుండా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని, కేంద్రం నుంచి విడుదలయ్యే నిధుల పైనే ఆధారపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపాదనలు పంపినా.. నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు నిధుల విడుదలపై కేంద్రం సైతం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. దీంతో, పుష్కర నిధులపై సందిగ్ధత నెలకొంది.
స్వల్ప వ్యవధిలో సాధ్యమేనా?
పుష్కరాలకు ఏడాది మాత్రమే గడువు ఉంది. ఈలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. ప్రధానంగా ఘాట్‌ల విస్తరణ, దగ్గరగా ఉన్నవాటి అనుసంధానం, కొవ్వూరు, నిడదవోలుల్లో ఘాట్‌ల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పుష్కర ఘాట్‌లో ఉన్న రాళ్లను తీసి కొత్తవి అమర్చడం, వీఐపీ ఘాట్ వద్ద ఆధునీకరణ, అప్పర్ రివర్‌ఫ్రంట్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. మిగిలిన వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెల నుంచి గోదావరికి వరదలు వస్తాయి. వర్షాలు విస్తారంగా కురుస్తాయి. దీంతో, పనుల నిర్వహణ అసాధ్యం. ఆ తరువాత పుష్కరాలకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. అంత స్వల్ప వ్యవధిలో పుష్కరాల పనులు చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో పనులు ఈపాటికే ప్రారంభించాలి. కానీ, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు ప్రశ్నార్థకమవుతున్నాయి. చివరిలో హడావుడిగా పనులు చేపట్టి, వచ్చిన నిధులు మింగేసేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఈ తాత్సారం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


