లగ్గం కుదిరింది.. | - | Sakshi
Sakshi News home page

లగ్గం కుదిరింది..

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

ఆషాఢంలో మళ్లీ విరామం

ఆషాఢ మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదనే అభిప్రాయం ఉంది. దాని ప్రకారం ఏ సంవత్సరంలోనూ ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు. అదే ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వివాహాది శుభ కార్యాలు జరగవు. తిరిగి శ్రావణ మాసం అంటే, ఆగస్టు 15 నుంచి మళ్లీ పెళ్లి బాజా మోగనుంది.

నేటి నుంచి రత్నగిరిపై

మోగనున్న పెళ్లి బాజా

నెల రోజుల తర్వాత తిరిగి సందడి

నవ దంపతులతో కళకళలాడనున్న

సత్యదేవుని ఆలయం

అన్నవరం: మూడు ముళ్ల బంధానికి లగ్గం కుదిరింది.. ఏడడుగులతో సాగే పయనానికి మంచి గడియ రానే వచ్చింది.. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో నిజ జ్యేష్ట మాసం సందర్భంగా తిరిగి శుక్రవారం నుంచి పెళ్లి బాజా మోగనుంది. అధిక జ్యేష్ట మాసం నేపథ్యంలో నెల రోజులు పెళ్లిళ్లకు బ్రేక్‌ పడింది. తిరిగి రత్నగిరి నవ దంపతులతో సందడిగా మారనుంది. ఈ మాసంలో సుమారు 600 వివాహాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా చైత్ర మాసం నుంచి అంటే మార్చి– ఏప్రిల్‌ నుంచి జ్యేష్ట మాసం అంటే జూలై వరకూ వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది చైత్ర, వైశాఖ మాసాల్లో అంటే మార్చి తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్‌, మే 11 వరకూ వివాహాలు జరిగాయి. ఆ తరువాత అధిక జ్యేష్ట మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదన్న పండితుల సూచనలతో మే 17 నుంచి జూన్‌ 15 వరకూ వివాహాది శుభకార్యాలేవీ జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమైంది. తిరిగి 19వ తేదీ శుక్రవారం నుంచి వివాహ శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.

పెళ్లిళ్లన్నీ కల్యాణ మండపాల్లోనే..

ఫ అన్నవరం దేవస్థానంలో ఏటా చైత్ర మాసం నుంచి జ్యేష్టం వరకు వివాహాలు ఆలయ ప్రాంగణంతో పాటు కల్యాణ మండపాల్లో జరుగుతాయి. అయితే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ సారి వివాహాలన్నీ కల్యాణ మండపాలు, విశ్రాంతి షెడ్లలోనే జరుగనున్నాయి.

ఫ సత్యగిరిపై దాత, పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మట్టే శ్రీనివాస్‌ దంపతులు నిర్మించిన శ్రీసత్య శ్రీనివాసా కల్యాణ మండపంలో 12 చిన్న వివాహ మండపాలు, అదే విధంగా విశాఖపట్నానికి చెందిన పారిశ్రామికవేత్త ఎంఎస్‌ రెడ్డి నిర్మించిన శ్రీఎంఎస్‌ రెడ్డి అంజనీ వివాహ వేదికలో 12 చిన్న కల్యాణ మండపాల్లో వివాహ ముహూర్తానికి 24 వివాహాలు జరుగనున్నాయి. ఈ కల్యాణ మండపాలను పెళ్లి బృందాలు ఇప్పటికే రిజర్వ్‌ చేసుకున్నాయి.

ఫ దేవస్థానంలోని సత్యగిరిపై విష్ణు సదన్‌ సత్రంలోని 36 మ్యారేజ్‌ హాళ్లలో ఈ ముహూర్తాలకు వివాహాలు జరుగనున్నాయి. వీటితో పాటు రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో కూడా వివాహాలు చేయనున్నాయి.

ఫ అన్నవరంలోని సుమారు 20 లాడ్జీలలో కల్యాణ మండపాలలో కూడా వివాహాలు జరుగనున్నాయి.

సందడే సందడి..

పెళ్లిళ్ల సందడి మొదలు కావడంతో క్యాటరింగ్‌, సన్నాయి మేళం, పురోహితులకు డిమాండ్‌ ఏర్పడింది. వివాహ ముహూర్తాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరగనుంది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు కూడా సత్యదేవుని ఆలయానికి విచ్చేయనున్నారు.

వచ్చే నెల తొమ్మిది వరకు..

శుక్రవారం జ్యేష్ట పంచమి ఆశ్రేష నక్షత్రం సందర్భంగా రాత్రి 9.15 గంటల ముహూర్తంలో వివాహాలు జరుగనున్నాయి. ఈ నెల 20, 21, 22, 24, 25, 26, 27 తేదీల్లో, తిరిగి జూలై ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement