ఫ ఆక్వా రైతు దారుణ హత్య
ఫ కూలీలపైనే అనుమానం
ఫ కోనసీమ జిల్లాలో కలకలం
బయటి వ్యక్తులే అధికం
ఈ హత్య ఘటన జిల్లాలో ఆక్వా రైతుల్లో కలవరం రేపింది. ఆక్వా చెరువుల వద్ద స్థానిక కూలీల కన్నా కాకినాడ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన వారు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన స్థానికేతరులు అధికంగా ఉంటున్నారు. 90 శాతానికి పైగా వీరే కావడం గమనార్హం. గత ఏడాది నవంబరు 19న రావులపాలెంలో మావోయిస్టు సరోజ్ మడవి (మాడ్వీ హాంధా)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మాకు అనుచరుడు. అదే సమయంలో మావోయిస్టుల కమ్యూనికేషన్ కమాండర్‌గా పనిచేశాడు. కోనసీమలో దాచుకోవడానికి వచ్చిన ఆయన సఖినేటిపల్లిలో ఆక్వా చెరువుల వద్ద సుమారు ఆరు నెలల పాటు పనిచేశాడు. అతని అరెస్టుతో అప్పట్లో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాజాగా కృష్ణంరాజు హత్యతో మరోసారి ఉలిక్కిపడ్డారు. స్థానిక కూలీల కంటే సగం ధరకే ఇతర ప్రాంతాల వాసులు చెరువుల వద్ద పనులకు రావడం, వారు 24/7 చెరువుల వద్దనే నివాసముండి పనిచేయడంతో ఆక్వా రైతులతో పాటు పీచు ఉత్పత్తిదారులు వీరిపైనా ఆధారపడుతున్నారు. అయితే పనులకు పెట్టుకుంటున్న వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డు లు చూడకుండా, కనీసం తెలుసున్న జట్టు మేస్త్రితో సంబంధం లేకుండా నేరుగా కూలీలను నియమిస్తే ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఐ.పోలవరం: దాడి చేసి, ఆపై రాళ్లతో కట్టి చెరువులో ఓ ఆక్వా రైతును పడేసి దారుణంగా హత్య చేశారు. అక్కడ పనికి వచ్చిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మురమళ్లకు చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు అనే లొల్ల కృష్ణ (64) బుధవారం రాత్రి తన సొంత చెరువుల వద్ద హత్యకు గురయ్యాడు. కొత్త మురమళ్ల వద్ద ఉన్న తన సొంత ఆక్వా చెరువుల వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లాడు. ఎంత సేపటికీ రాకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ అని వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో అతని వెతికేందుకు ఆక్వా చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి. కాని రైతు కృష్ణంరాజు జాడ తెలియలేదు. ఇదే సమయంలో చెరువుల వద్ద పనిచేస్తున్న కూలీలు కనిపించలేదు. వారికి ఫోన్ చేయగా, రైతు కృష్ణంరాజు తమకు రూ.ఏడు వేల సొమ్ము ఇచ్చేశారని, ఇంటికి వెళ్లిపోతున్నామని, ఆయన గురించి తమకేమీ తెలియదని చెప్పారు. కృష్ణంరాజు మోటారు సైకిల్ మురమళ్ల ఇరిగేషన్ రెగ్యులేటర్ వద్ద కనిపించింది. ఇవన్నీ చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వారికి అనుమానం వచ్చి చెరువులో వెతుకులాట ప్రారంభించారు. చెరువులో అతని మృతదేహం లభ్యమైంది.
రాళ్లు కట్టి.. చెరువులో వదిలేసి
కృష్ణంరాజు మృతదేహాన్ని చూస్తే కొట్టి చంపి, రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ పనికి వచ్చిన వారే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. పది రోజుల క్రితమే ఆ కూలీలు ఇక్కడ పనిచేసేందుకు వచ్చినట్టు తెలిసింది. పైగా వీరికి గంజాయి తాగే అలవాటు ఉందని అనుమానంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు నిర్ధారించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చెరువు వద్ద కృష్ణంరాజుకు పని చేసేందుకు వచ్చిన వారి మధ్య అరుపులు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు ఘటనా స్థలానికి వచ్చి హత్య జరిగిన తీరును పరిశీలించారు. కృష్ణంరాజు హత్య ఘటనలో కూలీలపైనే బలమైన అనుమానం ఉందని జిల్లా డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. ఘటన అనంతరం పనివారు తమ నివాసాన్ని ఖాళీ చేసి పరారైనట్లు గుర్తించామన్నారు. వారిని పట్టుకునేందుకు విజయవాడ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని రప్పించామన్నారు.


