ఫ వానపల్లిలో ప్రముఖ రంగస్థల నటుల సందడి
ఫ వందలాదిగా తరలివచ్చిన కళాభిమానులు
కొత్తపేట: మండలంలోని వానపల్లి శ్రీభద్రాద్రి సీతారామస్వామివారి ఆలయం వద్ద బుధవారం రాత్రి పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, పళ్లాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కామిశెట్టి అమ్మన్న నాయుడు, పద్మావతి దంపతులు సుమారు రూ.20 లక్షలతో రామాలయాన్ని పునర్నిర్మించారు. బుధవారం విగ్రహాల ప్రతిష్ఠను పురస్కరించుకుని పౌరాణిక నాటకాలను, ఆ కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఆలయ నిర్మాత అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న ప్రముఖ నటులను ఏరికోరి ఆయా పాత్రలకు కూర్చారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారులుగా రాణిస్తున్న నటీనటులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో సత్యహరిశ్చంద్ర (వారణాసి, కాటి సన్నివేశం), రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వారణాసి సన్నివేశం నుంచి ప్రస్తుత మూడో తరం నటుల్లో రంగస్థల రారాజుగా గుర్తింపు పొందిన జూనియర్ డీవీ సుబ్బారావు హరిశ్చంద్రునిగా, రంగస్థల కోకిలగా ఖ్యాతి పొందిన రత్నశ్రీ చంద్రమతిగా, నక్షత్రకునిగా లతాశ్రీ , వీరబాహుడిగా సత్యప్రసాద్ తదితరులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. యువకులు సైతం ఆ రాగాలాపనలో లీనమైపోయి ఈలలు, కేరింతలతో కళాకారులను ఉత్సాహపరిచారు. డీవీ సుబ్బారావు, రత్నశ్రీ ఉన్నత శృతిలో ఆలపించిన పద్యాలను గమనిస్తే రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలను తలపించాయి. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి.
పోటాపోటీగా తండ్రీ తనయులు
రామాజంజనేయ యుద్ధం నాటకంలో ఆంజనేయుడి పాత్ర అంటే గుర్తువచ్చే పేరు పేపకాయల లక్ష్మణరావు (సంపత్ నగర్). నంది అవార్డు గ్రహీత, అభినవ ఆంజనేయునిగా పేరొందిన లక్ష్మణరావు తనయుడు రామాంజనేయులు రాముడిగా, మనుమడు జూనియర్ లక్ష్మణరావు ఆంజనేయుడిగా యుద్ధ సన్నివేశంలో నువ్వా.. నేనా అన్నట్టు పోటాపోటీగా నటించారు. పద్యాలు ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. కళాభిమానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి గురువారం ఉదయం వరకూ ఉండి ప్రదర్శనలను తిలకించారు. అనంతరం రంగస్థల నటులను అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు ఘనంగా సత్కరించారు. బిళ్లకుర్రు మాజీ సర్పంచ్ నెల్లి లక్ష్మీపతిరావు, ట్రాన్స్‌కో డీఈఈ రామకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి బండారు దొరబాబు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, ప్రముఖ వ్యాపారవేత్తలు గొలకోటి సోమరాజు, సింగిరెడ్డి గోవిందస్వామి, చీకట్ల నాని తదితరులు పాల్గొన్నారు.


