14 బైక్‌ల స్వాధీనం
అనపర్తి: వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ బాలుడితో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. గురువారం అనపర్తి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బుధవారం స్థానిక ఐఎల్‌టీడీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, అనపర్తితో పాటు పది చోట్ల ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్టు అంగీకరించారని అన్నారు. ఇందులో రాజమహేంద్రవరం రామదాసుపేటకు చెందిన దుప్పాడ అనిల్ కుమార్ (బూస్ట్), అనపర్తికి చెందిన బహదూర్ బబ్లు, మరో బాలుడు ఉన్నారన్నారు. వారి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 14 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. అనిల్‌కుమార్‌పై ఇప్పటికే 16 చోరీ కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించడంలో ప్రధాన భూమిక పోషించిన అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్, ఎస్సై వినయ్ ప్రతాప్, సిబ్బంది శివ, త్రిమూర్తులును డీఎస్పీ అభినందించారు.


