● రాజమహేంద్రవరంలో వీడని ప్రతిష్టంభన
● 2027లో గోదావరి పుష్కరాలు
● అప్పటిలోగా ఎన్నికల నిర్వహణ అసాధ్యం
● ఎమ్మెల్యేల పంతంతో
ముందుకు కదలని ప్రక్రియ
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కలగానే మిగలనున్నాయా? ఇందుకు రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఒక కారణంగా నిలుస్తోందా? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన హామీకే దిక్కులేదా..? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఎన్నికల నిర్వహణపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో మేయర్ పీఠం ఆశిస్తున్న నేతల ఆశలు అడియాసలుగానే మిగలనున్నాయన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఇదీ సంగతి
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు 2012 తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. 2018 నుంచి పాలకవర్గం లేకపోవడంతో కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను నగరంలో విలీనం చేసే అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. రూరల్‌లోని గ్రామాలు విలీనం చేయకుండా ప్రస్తుతమున్న 50 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, విలీన గ్రామాలతో ఎన్నికలు నిర్వహించాలని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పట్టుబడుతుండటంతో ఈ వ్యవహారం ఎటూ తేలడం లేదు.
మంత్రి హామీకి దిక్కేది?
గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పుష్కర పనులు, ఏర్పాట్లు, నిర్వహణ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనే జరగనుంది. పనులు సవ్యంగా జరగాలంటే కార్పొరేషన్‌కు పాలకవర్గం అవసరం. ఇందులో భాగంగానే ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(రుడా) చైర్మన్ పోస్టును సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక కార్పొరేషన్ ఎన్నికలు సైతం నిర్వహిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ కాకినాడలో జరిగిన జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వివాదాలను పరిష్కరించి రెండు మాసాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి వ్యాఖ్యలతో గతేడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. మంత్రి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదు. ఈ పరిణామం నగర వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న మీమాంస ప్రజల్లో నెలకొంది.
పుష్కర పనుల పేరుతో హడావుడి
2027 పుష్కరాల నిర్వహణపై అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు మంజూరు కాకపోయినా.. పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. నెలలుగా పుష్కర ఏర్పాట్లు, నిధుల ప్రతిపాదనలపై తలమునకలవుతున్నారు. ఫలితంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రస్తావనే లేకుండా పోయింది. గ్రామాల విలీనం అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో వార్డుల విభజన ప్రక్రియ సైతం చేపట్టిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పట్లో కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
గ్రేటర్ హోదా దక్కేనా?
కార్పొరేషన్‌కు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఇక పుష్కరాల తర్వాతైనా జరుగుతాయా? అన్న స్పష్టత కొరవడింది. గ్రామాల విలీనం అంశం కోర్టు పరిధిలో ఉండటంతో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో రూరల్‌లోని 25 గ్రామాల విలీనం జరిగి ‘గ్రేటర్ రాజమహేంద్రవరం’ హోదా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని సజావుగా జరిగితే గ్రేటర్ రాజమహేంద్రవరంగా ప్రాధాన్యం దక్కుతుంది. పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి.
పుష్కర పనులపై మాటల యుద్ధం
పుష్కరాల నిర్వహణ సమయం దగ్గర పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పుష్కర ఘాట్ ఆధునీకరణ పనుల్లో సైతం టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన మంత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూటమిలో భాగమైనా పనుల్లో తమకు వాటాలు ఇవ్వలేదన్న ఉద్దేశంతో రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు జనసేన మంత్రి కందుల దుర్గేష్‌పై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు.
విడుదల కాని నిధులు
గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగి పాలకవర్గం కొలువుదీరితే ఆయా వార్డుల్లో ఎవరు నెగ్గితే వారి ఆధ్వర్యంలో నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేటర్లుగా నెగ్గితే వారి పెత్తనం ఎక్కడ భరించాల్సి వస్తుందో..? పుష్కర నిధుల పనుల్లో వాళ్లకు సైతం పర్సంటేజీలు పంచాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేదు. ఎన్నికలు జరిగితే టీడీపీతో పాటు కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ అభ్యర్థులకు కొన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. దీనికితోడు మేయర్ స్థానం తమదేనంటూ జనసేన నేతలు ఇప్పటికే ప్రకటిస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం మెజార్జీ కార్పొరేటర్ స్థానాలు ఆశిస్తోంది. ఇలాంటి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎన్నికలు జరిగితే తాము పట్టుకోల్పోతామన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఎన్నికలకు మొగ్గు చూపడం లేదు. పుష్కరాల సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కాలేదు.


