● 24 గంటలు వైద్య సహాయం
అందేలా ఏర్పాటు
● ఈఓ ఆదేశం
అన్నవరం: సత్యదేవుని భక్తులకు 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు గాను రత్నగిరిపై పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న విశ్రాంతి షెడ్డు వద్ద హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదేశించారు. రత్నగిరిపై సకాలంలో వైద్యం అందక భక్తులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ‘దివ్యక్షేత్రం.. వైద్యం పూజ్యం’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 5న కథనం ప్రచురించింది. 50 సంవత్సరాలు దాటిన పలువురు భక్తులు ఉపవాసంతో సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు రాగానే డీ హైడ్రేషన్‌కు లోనై తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీనికితోడు గుండెపోటు, సుగర్, బీపీ తదితర వ్యాధిగ్రస్తులు వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు. వారికి తక్షణ వైద్యం అందించే ఏర్పాటు దేవస్థానంలో లేదు. కొండ దిగువన దేవస్థానం వైద్యశాలకు తరలించినా అక్కడ సరైన వైద్యం అందడం లేదు. దీంతో, మార్గం మధ్యలోనే కొంత మంది భక్తులు మృతి చెందుతున్నారు. గడచిన ఆరు నెలల్లో ఇద్దరు ఇదే విధంగా రత్నగిరిపై గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ అంశాలను ‘సాక్షి’ కథనం ప్రస్తావించింది. దీనిపై స్పందించిన ఈఓ దేవస్థానంలో కార్పొరేట్ ఆస్పత్రికి కేటాయించిన హెల్త్ సెంటర్‌లో ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానం వైద్యాధికారి హరికృష్ణతో పాటు ఇద్దరు నరులలో ఒకరిని షిఫ్టుల వారీగా భక్తులకు సేవలందించాలని ఆదేశించారు. ఈ మేరకు వారు అక్కడ సేవలందిస్తున్నారు. దీనిపై ‘రత్నగిరిపై ఎట్టకేలకు వైద్య సేవలు’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 14న కథనం ప్రచురించింది. రత్నగిరిపై 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు శాశ్వత ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అందులో ప్రస్తావించింది. దీంతోపాటు హెల్త్ సెంటర్‌లో వైద్య సేవల వలన కలిగే ఇతర ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ఈఓ సూర్యచక్రధరరావు పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెల్స్ విశ్రాంతి షెడ్డు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో 24 గంటలూ పని చేసేలా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు అందుబాటులో ఉండేలా, అత్యవసరమైతే దిగువకు తరలించేలా ఘాట్ రోడ్డుకు దగ్గరగా దీనిని ఏర్పాటు చేయాలని సూచించారు.


